‘ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్ల’ తయారీలో సరికొత్త విధానం
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

‘ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్ల’ తయారీలో సరికొత్త విధానం

డీఆర్డీవో, అక్రెమ్‌ శాస్త్రవేత్తలకు పేటెంట్‌ మంజూరు


బాలక బర్కాకటి

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ రంగంలో వినియోగించే ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్ల తయారీకి కొత్త విధానం ఆవిష్కరించారు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అక్రెమ్‌ శాస్త్రవేత్తలు. అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ హై ఎనర్జీ మెటీరియల్స్‌(అక్రెమ్‌) పేరిట హెచ్‌సీయూలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో శ్రేష్ఠత కేంద్రం(సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌) ఉంది. ఇక్కడ ప్రాజెక్టు సైంటిస్ట్‌ డాక్టర్‌ బాలక బర్కాకటి నేతృత్వంలో ప్రాజెక్టు సహాయకులు సహేలి డే, నితీష్‌సింగ్‌ సంయుక్తంగా పర్యావరణహిత ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్లను అభివృద్ధి చేశారు. వీరి పరిశోధనకు ‘గ్రీన్‌ మెథడ్‌ ఫర్‌ సింథసిస్‌ ఆఫ్‌ బిస్‌(ఫ్లొరోఅల్కైల్‌) కార్బొనేట్‌’’ పేరిట డీఆర్డీవో ఛైర్మన్‌, అక్రెమ్‌ కేంద్రాలకు పేటెంట్‌ మంజూరు చేస్తూ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా ధ్రువీకరణపత్రం జారీ చేసింది.

ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్లను ప్రధానంగా క్షిపణుల తయారీ, రక్షణ రంగంలో వాడే ప్లాస్టిక్‌లో వినియోగిస్తారు. కానీ, ప్లాస్టిసైజర్ల తయారీలో ఎంతో ప్రమాదకరమైన ఫాస్జీన్‌, ట్రైఫాస్జీన్‌ వంటివి వినియోగిస్తున్నారు. వీటిని మనిషి పీల్చితే ప్రాణాలకు పెనుముప్పు వాటిల్లుతుంది. ఇలా తయారు చేసిన ప్లాస్టిక్‌ పదార్థాలను రీసైకిల్‌ చేయడం ఇబ్బందితో కూడుకున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పర్యావరణహితమైన ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్లను రూపొందించాలని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. దీనికి పరిష్కారం చూపిస్తూ అక్రెమ్‌లోని శాస్త్రవేత్తలు హరిత ఎనర్జిటిక్‌ ప్లాస్టిసైజర్ల తయారీకి నూతన విధానాన్ని కనుగొన్నారు. ఈ ప్లాస్టిసైజర్లు తక్కువ ధరకు లభించడంతోపాటు మనిషి ఆరోగ్యానికి శ్రేయస్కరమైనవని డాక్టర్‌ బాలక తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని