రెండేళ్లలో 31 ఎస్టీపీల నిర్మాణం: మేయర్‌
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

రెండేళ్లలో 31 ఎస్టీపీల నిర్మాణం: మేయర్‌

సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ విజయలక్ష్మి, ఉప మేయర్‌ శ్రీలతారెడ్డి, కార్పొరేటర్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం వస్తున్న మురుగు నీటిలో 46.78 శాతం మాత్రమే శుద్ధి అవుతోందని, రానున్న రోజుల్లో వందశాతం శుద్ధి చేసేందుకు బృహత్‌ ప్రణాళిక సిద్ధమైందని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉప మేయర్‌ శ్రీలతారెడ్డితో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 1650 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) మురుగు వస్తుండగా, 772 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 25 శుద్ధి కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు. మిగిలిన 878 ఎంఎల్‌డీ మురుగు చెరువుల్లో చేరుతోందని వివరించారు. దీన్ని కట్టడి చేసేందుకు ముంబయికి చెందిన షా టెక్నికల్‌ కన్సల్టెంట్‌ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. నగరంలో మొత్తం 1950 ఎంఎల్‌డీ మురుగు వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని, అందులో 1650 ఎంఎల్‌డీ జీహెచ్‌ఎంసీ, 300 ఎంఎల్‌డీ ఓఆర్‌ఆర్‌ పరిధి నుంచి వస్తోందన్నారు. 2036 నాటికి మొత్తం 2,814 ఎంఎల్‌డీ, 2051కి 3715 ఎంఎల్‌డీలకు పెరుగుతుందని సంస్థ అంచనా వేసిందని తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 31, ఓఆర్‌ఆర్‌ పరిధిలో మరో 31 కలిసి 62 సీవరేజీ ప్లాంట్లను నిర్మించాలని సంస్థ ప్రతిపాదించిందని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు దశల్లో 1259.5 ఎంఎల్‌డీ సామర్థ్యం ఉండేలా 31 ఎస్టీపీలను నిర్మిస్తామన్నారు. ప్లాంటు నిర్మాణంతో పాటు 15 ఏళ్ల నిర్వహణకు రూ.3866.21కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కరోజులోనే ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞత తెలిపారు. రెండేళ్లలో ఈ కేంద్రాల నిర్మాణం పూర్తవుతుందని, మురుగు నీటి శుద్ధిలో అన్ని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటిస్థానంలో ఉంటుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని