HMDA: హెచ్‌ఎండీఏలో ఫైల్స్‌ ‘డిలీట్‌’
eenadu telugu news
Updated : 25/09/2021 08:28 IST

HMDA: హెచ్‌ఎండీఏలో ఫైల్స్‌ ‘డిలీట్‌’

సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంలో మాయం

ఈనాడు, హైదరాబాద్‌: ఓ దరఖాస్తుదారుడు ఆరు నెలల కిందట లేఅవుట్‌ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో అంతా సక్రమంగానే ఉందంటూ అధికారులు చెప్పారు. కొన్ని రోజుల కిందట హెచ్‌ఎండీఏ నుంచి షార్ట్‌ ఫాల్‌ నోటీసు వచ్చింది. వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయి చూస్తే.. అప్‌లోడ్‌ చేసిన ఫైల్స్‌(ధ్రువీకరణ పత్రాలు) ఒక్కటీ కనిపించలేదు. ఇదే అనుభవం చాలా మంది దరఖాస్తుదారులకు ఎదురైంది.

* ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట్‌ జిల్లాల్లో హెచ్‌ఎండీఏ విస్తరించింది. ఈ ప్రాంతాల్లో (జీహెచ్‌ఎంసీ మినహా) నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి. ఇందుకు ‘డైరెక్ట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(డీపీఎంఎస్‌)’ అందుబాటులో ఉంది. అనుమతులిచ్చే బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ నుంచి సంబంధిత జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. డీపీఎంఎస్‌ను, టీఎస్‌-బీపాస్‌ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసేందుకు యత్నించగా విజయవంతం కాకపోగా కొంత సమాచారం పోయింది.

మళ్లీ జత చేసే క్రమంలోనూ...

ఏదైనా అర్జీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయకపోతే, హెచ్‌ఎండీఏ అధికారులు ‘షార్ట్‌ ఫాల్‌’ నోటీసులు జారీ చేసి, కొంత సమయం ఇస్తారు. ఫైల్స్‌ డిలీట్‌ అయిన దరఖాస్తులకు ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేయాల్సిన, పాత లేఅవుట్ల ఫైల్స్‌ డిలీట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ‘షార్ట్‌ ఫాల్స్‌’ను అప్‌లోడ్‌ చేసే క్రమంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

కొత్త దరఖాస్తులకు అవకాశమెప్పుడో... ?

పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలని గతంలోనే ప్రభుత్వం హెచ్‌ఎండీఏను ఆదేశించింది. కొత్తవి తీసుకోవద్దని స్పష్టం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్లకు బదలాయించిన తర్వాత ప్రత్యేక మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో నెలన్నర రోజుల నుంచి కొత్త దరఖాస్తులు తీసుకోవడం లేదు. దరఖాస్తుదారులు అమీర్‌పేట్‌లోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ‘హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వస్తే.. మాకేం తెలియదంటూ అధికారులు తిప్పి పంపుతున్నారు’ అని మేడ్చల్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని