ఆమెకు ‘చిత్ర’వధ... మనోవ్యధ!
eenadu telugu news
Updated : 25/09/2021 10:54 IST

ఆమెకు ‘చిత్ర’వధ... మనోవ్యధ!

రహస్యంగా చిత్రీకరించి బెదిరింపుల పర్వం

బాధితుల మౌనంతో చెలరేగుతున్న ప్రబుద్ధులు

ఈనాడు, హైదరాబాద్‌

నగర శివార్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ అనారోగ్యంతో చేరారు. తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా ఆసుపత్రి వార్డుబాయ్‌.. మంచంపై స్పృహలో లేని మహిళా రోగిని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించటం ప్రారంభించాడు. అక్కడకు వచ్చిన సహాయకులు గమనించి కేకలు వేయటంతో స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేశారు. 

పాతబస్తీకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఆమె చరవాణికి అశ్లీల చిత్రాలు వచ్చాయి. వాటిలో తానే ఉండటంతో వణికిపోయింది. విషయం తెలిసిన యువకుడు పెళ్లివద్దన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీటీమ్స్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. యువతిని పెళ్లి చేసుకోవటం ఇష్టంలేని కాబోయే వరుడే ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి పంపినట్టు నిర్ధారించారు. 

ఈ తరహా ఘటనల్లో ‘ఆమె’ భయం విషనాగులకు బలం.. బయటకు చెప్పలేని బలహీనత ప్రబుద్ధులకు అవకాశంగా మారుతోంది. వెరసి.. ఆయినోళ్లు.. బయటివాళ్లు ఇంటాబయటా.. ఫొటోలు.. వీడియోలు తీసి మార్ఫింగ్‌ చేస్తున్నారు. చిత్రీకరించిన దృశ్యాలను బూచిగా చూపుతూ లైంగిక వాంఛలు తీర్చమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వివిధ కారణాలతో బయటకు చెప్పేందుకు మహిళలు వెనుకంజ వేస్తుండటంతో వారి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అందరికీ తెలిసి పోతుందన్న ఉద్దేశంతో కేసులు వద్దంటూ రాజీ పడుతున్నారు. 


ఫిర్యాదులతోనే ఆగడాలకు అడ్డుకట్ట 

ఏడాది క్రితం ఓ జంటకు పెళ్లయింది.. భార్యాభర్తల చరవాణులు, మెయిల్స్‌కు అశ్లీలచిత్రాలు వచ్చాయి. ఆమె ప్రవర్తన మంచిదికాదనేది సారాంశం. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో గుట్టురట్టయింది. ఆ మహిళను పెళ్లిచేసుకోవాలని ఆశపడిన మేనమామ కక్ష పెంచుకుని ఇలా చేసినట్టు గుర్తించారు. మహిళల వ్యక్తిగత చిత్రాలు, దృశ్యాలను చిత్రీకరిస్తూ పట్టుబడిన సందర్భాల్లో చుట్టూ ఉన్న వారు కొట్టి, సెల్‌ఫోన్లు లాక్కుని వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబీకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోతున్నారు. ఇంకొందరు సంసారంలో కలతలు వస్తాయనే భయంతో నోరుమెదపడం లేదని షీ టీమ్స్‌ సమన్వయకర్త డా.మమతా రఘువీర్‌ విశ్లేషించారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని