పథకం ప్రకారమే వృద్ధుల అపహరణ
eenadu telugu news
Updated : 25/09/2021 11:52 IST

పథకం ప్రకారమే వృద్ధుల అపహరణ


మహమ్మదీ ఉన్నీసాబేగం, అస్మత్‌ ఉన్నీసాబేగం

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అమీర్‌పేటలోని లీలానగర్‌ నుంచి ఇద్దరు వృద్ధురాళ్లు కిడ్నాప్‌నకు గురైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వృద్ధురాళ్లు నివసిస్తున్న ఇంటి కోసం అక్కాచెల్లెళ్లయిన అస్మత్‌ ఉన్నీసాబేగం(73), మహమ్మదీ ఉన్నీసాబేగం(70)లను గురువారం ఉదయం ఇంటి నుంచి కారులో బలవంతగా తీసుకుపోయి అమీన్‌పూర్‌లో నిర్భందించిన విషయం తెలిసిందే. అప్రమత్తమైన బాధితులు స్థానికుల సాయంతో బయటపడి పోలీసులను ఆశ్రయించారు. ఎస్సార్‌నగర్‌ పోలీసులు మిరాజ్‌ అహ్మద్‌ ఖురేషీతో పాటు మరో నలుగురిపై కిడ్నాప్‌, దాడి కేసులను నమోదు చేశారు. పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. మిరాజ్‌ అహ్మద్‌ ఖురేషీ గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించామని ఎస్సార్‌నగర్‌ సీఐ సైదులు తెలిపారు.

ఆస్తి వివాదాల కారణంగానే..

అమీర్‌పేట లీలానగర్‌లో నవాబ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌కు చెందిన 2600 గజాల స్థలం, ఇల్లూ ఉంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. 2001లో మిరాజ్‌ అహ్మద్‌ ఖురేషీ నుంచి కొందరు ఈ స్థలాన్ని కొనుగోలుచేసినట్లు అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. యూసుఫ్‌ అలీఖాన్‌ మరణించడంతో స్థలం కోసం ఆ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. అతనితోపాటు ఆయన కుటుంబంలోని అందరూ మృతి చెందగా.. ప్రస్తుతం ఆయన కుమార్తెలైన అస్మత్‌ ఉన్నీసాబేగం, మహమ్మదీ ఉన్నీసాబేగం మాత్రమే స్థలంలో ఉన్నారు. వీరిని ఖాళీ చేయించేందుకు పలుమార్లు యత్నించి విఫలమయ్యారు. ఈ వివాదంలో కొందరు రాజకీయ నాయకుల జోక్యం ఉన్నట్లు తెలిసింది. తోబుట్టువులు ఇద్దరూ తమకు ప్రాణహాని ఉందంటూ గతంలోనే పోలీసులను ఆశ్రయించారు.

ఇంట్లో సామగ్రి ధ్వంసం

గురువారం ఉ. 7.30 ప్రాంతంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తోబుట్టువులను బెదిరించారు. నోటికి ప్లాస్టర్‌ వేసి, కాళ్లు చేతులు కట్టేశారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. చరవాణులను లాక్కున్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలను ఆగంతుకులు లాక్కున్నారు. కొందరు నకిలీ పత్రాలను సృష్టించడం ద్వారా తమ ఆస్తిని ఆక్రమించారని, తమకు న్యాయం జరిపించాలని వీరు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని