కష్టపడి చదివారు.. సివిల్స్‌లో మెరిశారు
eenadu telugu news
Published : 25/09/2021 02:28 IST

కష్టపడి చదివారు.. సివిల్స్‌లో మెరిశారు

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, గాంధీనగర్‌

కష్టపడి చదివారు.. కొందరు తొలి ప్రయత్నంలో.. మరికొందరు రెండు, మూడు ప్రయత్నాల్లో విజయం సాధించారు. సివిల్స్‌ 2020లో ప్రతిభ కనబరిచారు. ర్యాంకర్లు తాము పడిన శ్రమ, కుటుంబ వివరాలు ‘ఈనాడు’తో పంచుకున్నారు. సివిల్స్‌ శిక్షణకేంద్రాలకు అడ్డా అయిన అశోక్‌నగర్‌లో సందడి నెలకొంది.


చిన్నప్పటి కల

- ఉప్పల సంజన సిన్హా, 207వ ర్యాంకు

మాది మలక్‌పేట. నాన్న ఉదయసింహ న్యాయవాద వృత్తిలో ఉండగా, అమ్మ అరుణశ్రీ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మేనేజర్‌. మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. నా అప్షనల్‌ సబ్జెక్టు సోషియాలజీ. 2017 బీటెక్‌ పూర్తయ్యింది. చిన్నప్పట్నుంచి ఐఏఎస్‌ కావాలన్నదే నా లక్ష్యం. రోజుకు 8-9 గంటలు చదివాను.


గురుకులంలో చదివా

కోట కిరణ్‌కుమార్‌, 652వ ర్యాంకు

మాది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బీమవరం. పదో తరగతి వరకూ దమ్మపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి, ఇంటర్‌ హైదరాబాద్‌లో సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్‌ చేశా. అనంతరం సివిల్స్‌ కోసం శ్రమించా. గతంలో రెండుసార్లు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. మూడో పర్యాయంలో సివిల్స్‌ సాధించా. తల్లిదండ్రులు కోట వజ్రమ్మ, కృష్ణయ్య. సోషియాలజి ఆప్షనల్‌ సబ్జెక్ట్‌.


ఎంబీబీఎస్‌ చదివి.. సివిల్స్‌వైపు

- గుండ్రాతి పృథ్వీనాథ్‌ గౌడ్‌, 541వ ర్యాంకు

మాది వనపర్తి జిల్లా కొత్తకోట. 2019లో ఉస్మానియా మెడికల్‌ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ చేశాను. నా ఆప్షనల్‌ ఆంత్రోపాలజీ. ఎంబీబీఎస్‌ ఇంటర్న్‌షిప్‌లో ఉన్నప్పుడు కలెక్టర్‌ శ్వేతమహంతిని చూసి స్ఫూర్తి పొంది సివిల్స్‌ రాయాలనుకున్నా. ఎక్కువ మందికి సేవ చేయవచ్చని సివిల్స్‌ ఎంచుకున్నా. తండ్రి శ్రీనివాస్‌గౌడ్‌ టౌన్‌ప్లానర్‌. అమ్మ వనజ గృహిణి. రోజుకు పది గంటలు చదివేవాడిని. రెండో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను.


రెండో ప్రయత్నంలో సాధించా

- కనకాల రాహుల్‌రెడ్డి, 218వ ర్యాంకు

మాది భూపాలపల్లి. నాచారంలో స్థిరపడ్డాం. 2018లో బీటెక్‌ పూర్తయ్యాక సివిల్స్‌ రాయాలని నిర్ణయించుకుని.. సాధన చేశాను. అమ్మ అరుణ. నాన్న దేవేందర్‌రెడ్డి ఎల్‌ఐసీలో పనిచేస్తున్నారు. ఇది నా రెండో ప్రయత్నం. ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా ఆప్షనల్‌ పొలిటికల్‌ సైన్స్‌. 2019లో మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను.


మూడో దఫాలో సాధించా

- ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌, 498వ ర్యాంకు

మాది విజయనగరం జిల్లా. అమ్మ స్వర్ణలత అక్కడే ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాది మూడో ప్రయత్నంలో ర్యాంకు సాధించాను. నాది ఆప్షనల్‌ సబ్జెక్టు పొలిటికల్‌సైన్స్‌- అంతర్జాతీయ వ్యవహారాలు. బీటెక్‌ పూర్తయ్యాక సివిల్స్‌వైపు దృష్టి పెట్టాను. నాలుగేళ్లుగా సివిల్స్‌పైనే ధ్యాస పెట్టి చదివాను. ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని