రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే గాయబ్‌
eenadu telugu news
Published : 25/09/2021 07:02 IST

రెండ్రోజుల్లో పెళ్లి.. అంతలోనే గాయబ్‌

49 ఏళ్ల వ్యక్తికి రూ.4.89 లక్షలు టోకరా

ఈనాడు, హైదరాబాద్‌: జీవిత చరమాంకంలో తోడుంటే బాగుంటుందని భావించాడు. 49 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకుని కొంగొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆశించాడు. ఓ మహిళ వివాహం చేసుకునేందుకు ముందుకు రావడంతో ఆనందించాడు. ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. తీరా రూ.4.89 లక్షలు వసూలు చేసిన పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులు, పెళ్లిళ్ల పేరయ్య జాడ లేకపోవడంతో కంగుతిన్నాడు. గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తెనాలి.. విజయనగరం... బాధితుడు రెండో పెళ్లి కోసం మూడు నెలల కిందట వివిధ మ్యారేజ్‌ బ్యూరోలను సంప్రదించాడు. నెల తర్వాత పింద్రోతు శివయ్య అనే వ్యక్తి కాల్‌ చేశాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ మ్యారేజ్‌ బ్యూరో నుంచి మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జులై 5న కొందరు మహిళల చిత్రాలు వాట్సాప్‌లో పంపించాడు. నచ్చలేదని బాధితుడు చెప్పడంతో అదే నెల 10న మరికొందరివి పంపించాడు. అప్పుడు కూడా అదే సమాధానం రావడంతో శివయ్య.. రెండ్రోజుల తర్వాత ఒకే ఒక్క ఫొటో పంపించాడు. ఆమె నచ్చిందని.. ఇతర వివరాలు పంపించాలని బాధితుడు కోరాడు. ఆమెది విజయనగరం జిల్లా అని.. వారికి మీరు నచ్చారని శివయ్య చెప్పాడు.

ఆగస్టు 25న ముహూర్తం.. బాధితుడు, ఆమె తరచూ ఫోన్లలో మాట్లాడుకున్నారు. మధ్యమధ్యలో ఆమె తల్లి కూడా మాట్లాడింది. సంబంధం ఖాయం చేసిన తర్వాత శివయ్య పెళ్లికెలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఆమె కుటుంబం చేసిన అప్పులు తీర్చాలని సూచించాడు. కాబోయే భార్యనే కదా అని బాధితుడు పలు దఫాలుగా రూ.4.89 లక్షలు పంపించాడు. ఈ ఏడాది ఆగస్టు 25న రాత్రి 10.52 గంటలకు ముహూర్తం ఖాయం చేసుకున్నారు. ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేసి పెళ్లికి ఎంత మంది వస్తారు..? అంటూ ఆరా తీసేందుకు పెళ్లికి రెండ్రోజుల ముందు బాధితుడు శివయ్యకు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యుల నంబర్లు స్విచ్ఛాఫ్‌ వచ్చాయి. చివరకు తాను మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని