నగరాభివృద్ధిపై నజర్‌
eenadu telugu news
Updated : 25/09/2021 10:56 IST

నగరాభివృద్ధిపై నజర్‌

వచ్చే ఎన్నికల నాటికి రూ.వేల కోట్లతో అభివృద్ధి

విభాగాల వారీగా రూపుదిద్దుకుంటున్న ప్రణాళికలు

ఈనాడు-సిటీ బ్యూరో  ప్రధాన ప్రతినిధి

విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాజధాని అభివృద్ధిపై సర్కారు మరింత దృష్టిసారించింది. గత ఎనిమిదేళ్లగా ప్రధానంగా రోడ్లతోపాటు ఇతర మౌలిక రంగాలపై రూ.2 వేల కోట్లను వెచ్చించింది. మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా కీలకమైన విభాగాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావించింది. తదనుగుణంగా వచ్చే బడ్జెట్‌లో రూ.వేల కోట్ల నిధులను కేటాయించాలని సర్కార్‌ నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. త్వరలో మరికొన్ని అభివృద్ధి పనులకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏఏ విభాగాల్లో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టబోతోందన్న దానిపై ప్రత్యేక కథనం.


విద్యుత్తు సంస్థ

మహానగరంలో విద్యుత్తు వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. హైటెన్షన్‌ తీగలు ఇళ్ల మీదే వేలాడుతున్నాయి. విద్యుత్తు తీగలు పాతవయ్యాయి. భూగర్భ విద్యుత్తు కేబుల్‌ వ్యవస్థ పట్టాలెక్కలేదు. రాష్ట్రాల్లో విద్యుత్తు వ్యవస్థ ఆధునికీకరణకు కేంద్రం ఆదిత్య పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లను కేటాయించాలని సర్కార్‌ కేంద్రాన్ని కోరింది. ఈ నిధులొస్తే నగరంలో విద్యుత్తు వ్యవస్థను ఆధునికీకరించనున్నారు.


జాతీయ రహదారులు

నాలుగు హైవేల విస్తరణను 2022 చివరికి పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.283 కోట్లతో ఆరాంఘర్‌-శంషాబాద్‌ హైవే, ఉప్పల్‌-మేడిపల్లి రోడ్లును రూ.623 కోట్లతో విస్తరిస్తున్నారు. రూ.216 కోట్లతో అంబర్‌పేట వద్ద స్కైవే, రూ.750 కోట్లతో మల్కాపూర్‌ వరకు విజయవాడ హైవేని విస్తరిస్తారు.


బల్దియాలో...

రూ.1500 కోట్లతో ఆకాశమార్గాలు, రోడ్ల విస్తరణ చేపట్టారు. వచ్చే రెండేళ్లలో రూ.3 వేల కోట్లను సమీకరించాలని నిర్ణయించారు. ప్రధానంగా లింక్‌ రోడ్లపై దృష్టిసారించనున్నారు. రూ.1500 కోట్లతో నాలాలపై ఆక్రమణలను తొలగించి, విస్తరించాలని నిర్ణయించారు. 25 చెరువులను సుందరీకరిస్తారు.


మెట్రో విస్తరణ ఖాయం

రాయదుర్గం-శంషాబాద్‌ విమానాశ్రయం మధ్య మెట్రో విస్తరణకు సర్కార్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది చివరికి గానీ 2022 ప్రథమార్థంలో గానీ టెండర్లను పిలవాలని భావిస్తోంది. ఎల్బీనగర్‌ నుంచి నాగోలు వరకు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాఫూల్‌ వరకు ప్రతిపాదనను సర్కార్‌ పరిశీలనలోకి తీసుకుందని ఓ అధికారి తెలిపారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తయినా రైళ్లను నడపడం లేదు. రాష్ట్ర వాటా ఇచ్చి రైళ్లను నడిపించాలని అధికారులు నిర్ణయించారు.


వైద్యం.. ప్రాధాన్యం

ఒక్కొక్క దాంట్లో వెయ్యి పడకలతో గడ్డిఅన్నారం మార్కెట్‌, అల్వాల్‌, ఛాతీ ఆస్పత్రి ఆవరణల్లో సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను రూ.450 కోట్లతో నిర్మించాలని తలపెట్టారు. పటాన్‌చెరులో కేంద్ర నిధులతో మరో ఆస్పత్రి నిర్మించనున్నారు. 2022లో టెండర్లు పిలవనున్నారు. నిమ్స్‌లో రూ.250 కోట్లతో భవనాన్ని నిర్మించాలనుకుంటున్నారు.


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

రెండేళ్ల కిందట బంజారాహిల్స్‌లో రూ.450 కోట్లతో చేపట్టిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనం దాదాపు పూర్తికావచ్చింది. అందుబాటులోకి వస్తే నగర పోలీసు కమిషనరేట్‌ అందులోకి వెళుతుంది. అత్యాధునిక వ్యవస్థల ద్వారా శాంతి భద్రతలను పర్యవేక్షించొచ్ఛు దీన్ని పూర్తి చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. నగరంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలను నిర్మించాలని తలపెట్టారు.


మురుగుశుద్ధి, తాగునీరు

జలమండలి పరిధిలో రూ.5066 కోట్లతో మురుగుశుద్ధి కేంద్రాలు, తాగునీటి పైపులైన్లను వేయాలని నిర్ణయించడంతో జలమండలి అధికారులు ప్రణాళిక రూపొందించబోతున్నారు. 62 మురుగుశుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. నగరంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసి బయటకు పంపాలన్నది లక్ష్యం. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో పైపులైను నిర్మాణం ప్రారంభించనున్నారు. కేశవాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను 2022 చివరికల్లా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ మేఘాకు సర్కార్‌ డెడ్‌లైన్‌ విధించింది. శుక్రవారం జలమండలి ఎండీ దానకిశోర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరులోపు పనులకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. దాదాపు 2 వేల కి.మీ. మేర పైపులైన్లు నిర్మిస్తామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని