వరదలో మునిగిన బాటసారి
eenadu telugu news
Published : 25/09/2021 02:37 IST

వరదలో మునిగిన బాటసారి


నీట మునిగిన వ్యక్తిని తాడుతో లాగుతున్న స్థానికులు

చందానగర్‌, న్యూస్‌టుడే: యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితం.. ఓ రైల్వే వంతెన కింద భారీగా నిల్వ చేరిన వరద నీరు బాటసారులకు ప్రాణాంతకంగా మారిన వైనమిది. చందానగర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద వరద నీటిలో మునిగి ప్రమాదంలో చిక్కుకున్న ఉన్న వ్యక్తిని స్థానికులు కాపాడటంతో ప్రాణాపాయం తప్పింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అండర్‌ బ్రిడ్జి కింద ఇటీవల వరద నీరు భారీగా నిల్వ చేరింది. ఈ విషయం తెలియక ఓ వ్యక్తి వంతెన కింద నుంచి పాపిరెడ్డికాలనీ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తీరా లోపలికి వెళ్లాక ఆరు అడుగుల నీరు ఉండటంతో వాహనం ముందుకు కదలక ఆగిపోయింది. తల వరకు నీరు చేరడంతో నెట్టుకుంటూ వెళ్లలేక కాపాడండి అంటూ అరిచాడు. హుడా కాలనీ వైపు ఉన్న ఇంటీరియర్‌ దుకాణదారులు, పాపిరెడ్డికాలనీవాసులు వచ్చి తాడు వేసి అతడిని బయటికి లాగి రక్షించారు.

సమాచారం లేకనే.. చందానగర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జికి ఒక వైపు హుడా కాలనీ, మరోవైపు పాపిరెడ్డి కాలనీ ఉంది. భారీగా నీరు ఉందని ఇరువైపుల ఉన్న కాలనీవాసులకు మాత్రమే తెలుస్తుంది. ద్విచక్ర వాహనం పై వచ్చే కొత్త వారికి అవగాహన లేక వరద నీటిలో ఇరుక్కుపోతున్నారు. ఆయా విభాగాల నిర్లక్ష్యంతో భారీగా నీరు నిలిచి పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని హుడా కాలనీ వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, స్థానికులు కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని