చెక్‌డ్యాంలో జారిపడి బాలుడి మృత్యువాత
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

చెక్‌డ్యాంలో జారిపడి బాలుడి మృత్యువాత

ధూల్మిట్ట (మద్దూరు), న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు చెక్‌డ్యాంలో జారిపడి నీట మునిగి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ధూల్మిట్ట మండలం లింగాపూర్‌లో చోటుచేసుకుంది. శిక్షణ ఎస్‌ఐ వంశీకృష్ణ భరద్వాజ్‌ తెలిపిన వివరాలు.. చేర్యాల మండలం కాశెగుడిసెలు (అలియాబాద్‌)కు చెందిన నూర్‌ అహ్మద్‌, ఇమామ్‌బీలకు ఇద్దరు కుమారులు. నూర్‌ అహ్మద్‌ సౌదీఅరేబియాకు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. ఇమామ్‌బీ కూలీ పనులు చేసుకుంటూ కుమారులతో కలిసి కాశెగుడిసె గ్రామంలోనే ఉంటున్నారు. పెద్ద కుమారుడు షేక్‌గౌస్‌ (17) ఆరోతరగతి చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శుక్రవారం షేక్‌గౌస్‌ తన నలుగురు మిత్రులతో కలిసి చేపలు పట్టుకునేందుకు లింగాపూర్‌ చెక్‌డ్యాం వద్దకు వెళ్లాడు. షేక్‌గౌస్‌ ఓ చోట, మిగతా వారంతా మరోచోట చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో షేక్‌గౌస్‌ గాలం నీటిలో చిక్కుకోగా దాన్ని తీసేందుకని చెక్‌డ్యాంలోకి దిగగా, ప్రమాదవశాత్తు కాలుజారడంతో నీట మునిగి ఊపిరాడక మృతి చెందాడు. దీన్ని గమనించిన అతడి మిత్రులు వెళ్లి గాలించగా మృతదేహం లభ్యమైంది. కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని శిక్షణ ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని