యువతి ప్రాణం బలిగొన్న ట్యాంకర్‌!
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

యువతి ప్రాణం బలిగొన్న ట్యాంకర్‌!

 

దుండిగల్‌, న్యూస్‌టుడే: నీటి ట్యాంకర్‌ ఢీకొని యువతి మృతిచెందింది. దుండిగల్‌ సీఐ రమణారెడ్డి, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రేగెడి మండలం కొమిరి గ్రామానికి చెందిన పి.అప్పలస్వామి, జ్యోతి దంపతుల చిన్న కుమార్తె పి.సులోచన(25) బతుకుదెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చింది. గుమ్మడిదలలోని చిన్నమ్మ ఇంట్లో ఉంటూ దుండిగల్‌ పురపాలిక పరిధి డి.పోచంపల్లిలోని గ్లాండ్‌ ఫార్మా పరిశ్రమలో నాలుగేళ్లుగా కూలీగా పనిచేస్తోంది. శుక్రవారం విధులు ముగించుకొని పరిశ్రమ గేటు బయటకు వచ్చింది. అదే సమయంలో లోపలి నుంచి బయటకు వెళ్తున్న నీటి ట్యాంకర్‌ వెనక నుంచి ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

* సాయంత్రం 4 గంటలకు జరిగిన ప్రమాదాన్ని తొలుత ఎవరూ గమనించలేదు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని అంతా భావించారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి పని చేసే పరిశ్రమకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్‌ ఢీకొట్టినట్లు నిర్ధారించారు. డ్రైవర్‌ ప్రమాదం జరిగాక వాహనాన్ని ఆపకపోవడం గమనార్హం. దీనికితోడు ఘటన జరిగిన సమయంలో నడుపుతున్నది శ్రీకాంత్‌ కాగా, లొంగిపోయింది మాత్రం నర్సింహులు అని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐని వివరణ కోరగా విచారించి నిజానిజాలు వెల్లడిస్తామన్నారు.

తల్లిదండ్రుల లేకున్నా..: సులోచన తల్లి చిన్నప్పుడే మృతిచెందింది. పది నెలల కిందట తండ్రి మృతిచెందాడు. సోదరికి ఐదు నెలల క్రితమే వివాహమైంది. అయినా పరిశ్రమలో పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడింది. ఇప్పుడు ప్రమాదంలో మృతితో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని