వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

చేర్యాల, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేర్యాల పట్టణ శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాకేశ్‌ తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన నీల రాములు (67) ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కిరాణ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బకాయి వసూలు చేసేందుకు ద్విచక్రవాహనంపై ముస్త్యాల వైపు వెళ్తుండగా చేర్యాల శివారులో రేణుకాఎల్లమ్మ గుడి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి సిద్దిపేట ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.

వాహనం అదుపుతప్ఫి. చెట్టును ఢీకొని..

నంగునూరు: ప్రమాదవశాత్తు ఇన్నోవా వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్‌ క్రాసింగ్‌ నుంచి పాలమాకుల వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది. రాజగోపాలపేట ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం అజ్జమర్రి గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మణ్‌, జగ్గారెడ్డిగారి సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గోడే విష్ణు, పటోల్ల బాలమణి, సందీప్‌రెడ్డి, అశోక్‌లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పాములపర్తికి వైద్యం నిమిత్తం శుక్రవారం ఉదయం వెళ్లారు. తిరిగి హుస్నాబాద్‌ మీదుగా సిద్దిపేట వైపు వస్తున్న క్రమంలో రాంపూర్‌ క్రాసింగ్‌, పాలమాకుల మధ్య వాహనం టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న లక్ష్మణ్‌ (34) అక్కడిక్కడే మృతి చెందగా విష్ణు, సురేందర్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

జాతీయ రహదారిపై..

కంది, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి గ్రామీణ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్‌ తెలిపిన వివరాలు.. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు చెందిన సంకరి గోపాల్‌రెడ్డి (50) సెంట్రింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి పనులు ముగించుకొని 65వ నంబరు జాతీయ రహదారిపై మామిడిపల్లి చౌరస్తా నుంచి సంగారెడ్డి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య రుక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని