శైలి నైరూప్యం.. ఆలోచన విభిన్నం
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

శైలి నైరూప్యం.. ఆలోచన విభిన్నం

రాణిస్తున్న యువ చిత్రకారుడు నహీంరుస్తుం

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

బాల్యం నుంచే తండ్రి నుంచి అబ్బిన చిత్రకళ. అందునా తన ప్రత్యేకతను చాటాలన్నదే ఆ యువకుడి ఆలోచన. అందుకు అనుగుణంగా చదువును కొనసాగిస్తూనే తనదైన రీతిలో పట్టు సాధించారు. చిత్రాలు గీయడమే వృత్తి.. ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఆయనే సిద్దిపేటకు చెందిన నహీం రుస్తుం. నైరూప్య చిత్రకారుడిగా విభిన్న చిత్రాలు గీసి తన ప్రత్యేకతను చాటుతున్నారు.

సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు రుస్తుం కుమారుడు నహీం రుస్తుం 2009లో విజ్‌వల్‌ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేశారు. తండ్రిని చూసి స్ఫూర్తి పొందిన ఇతను పదో తరగతిలోనే చిత్రాలు గీయడంపై పట్టు సాధించారు. నైరూప్య (అబ్‌స్ట్రాక్ట్‌) చిత్రం.. కచ్చితమైన రూపమంటూ కనిపించదు. వీక్షకుడు చూసే విధానం, కోణం ఆధారంగా ఆవిష్కృతం అవుతుంది. ఆలోచనా విధానాలను అనుగుణంగా సాక్షాత్కరిస్తుంది. చిత్రకారుడి మనసులో విభిన్న ఆలోచనల కలబోతగా రూపుదిద్దుకుంటుంది. 2004 నుంచి ఈ రంగంలో రాణిస్తున్నారు. కొన్నాళ్లు వివిధ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. తాజాగా సిద్దిపేటలోని ఆర్‌ఎస్‌ మెట్రోగార్డెన్‌లో వారం రోజుల పాటు ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.


రుస్తుం గీసిన దంపతుల చిత్రం

ప్రదర్శన.. శిక్షణ..: ఇప్పటి వరకు 300కి పైగా నైరూప్య చిత్రాలు గీశారు. వీటితో పాటు సాధారణమైనవి గీస్తున్నారు. ఏటా వేసవి సెలవుల్లో తండ్రితో కలిసి చిన్నారులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. హైదరాబాద్‌ సహా దిల్లీ, ముంబయి, ఇతర నగరాల్లో నిర్వహించిన 50కి పైగా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సొంతంగా ఆరు ప్రదర్శనలు ఇచ్చారు. కల్చర్‌ ఆఫ్‌ న్యూ దిల్లీ సంస్థ యంగ్‌ ఆర్టిస్టుగా పురస్కారం అందజేసింది. పొట్టిశ్రీరాములు వర్సిటీ, హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీలు పురస్కారాలు అందజేశాయి. మంత్రి హరీశ్‌రావు, తదితర ప్రముఖులు మన్ననలు పొందారు. ‘నాన్న స్ఫూర్తిగా అంతర్జాతీయస్థాయిలో చిత్రకారుడిగా రాణించాలని ఉంది. అనుగుణంగా నిత్యం సాధన చేస్తా..’ అని చెబుతున్నారు నహీం రుస్తుం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని