అత్తింటి వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

అత్తింటి వేధింపులు తాళలేక మహిళ బలవన్మరణం

కవిత

కోహెడ గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తింటి వేధింపులు భరించలేక మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోహెడ మండలం రాంచంద్రాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కవిత (36)కు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఒగులాపూర్‌ గ్రామానికి చెందిన రాజేశ్వర్‌రెడ్డితో 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి సంతానం కలగకపోవడంతో ఈ విషయమై భర్త, అత్తామామలు కవితను నిత్యం మానసికంగా వేధించసాగారు. పలుమార్లు గొడవపడి కూతురిని పుట్టింటికి పంపించారు. పలుమార్లు పంచాయితీలు సైతం జరిగాయి. అత్తింటివారు రూ.50 లక్షల విలువైన 3 ఎకరాల వ్యవసాయ భూమి తన పేరిట రాయాలని కవిత తండ్రి కనకారెడ్డిపైకి ఒత్తిడి తీసుకొచ్చాడు. రెండేళ్ల కిందట కవితకు చెందిన 10 తులాల ఆభరణాలు తీసుకొని పుట్టింటికి పంపించగా అప్పటినుంచి ఇక్కడే ఉంటోంది. రెండు రోజుల క్రితం రాంచంద్రాపూర్‌కు వచ్చిన రాజేశ్వర్‌రెడ్డి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించాలని భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన కవిత శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామ శివారులోని కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన కుటుంబ సభ్యులకు ఆమె కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతికారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కెనాల్‌లో మృతదేహమై తేలగా స్థానికులు గుర్తించి వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా భర్త రాజేశ్వర్‌రెడ్డి, అత్తామామ రాజవ్వ, మోహన్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని