శతశాతమే లక్ష్యం..
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

శతశాతమే లక్ష్యం..

జిల్లాలో ముమ్మరంగా టీకా పంపిణీ

కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు పాలనాధికారి

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: టీకా కొరతతో మందకొడిగా సాగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వారం రోజులుగా ముమ్మరంగా జరుగుతోంది. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం టీకాల పంపిణీ వేగవంతం చేసింది. శతశాతం వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ఆరోగ్య శాఖ ద్వారా ఏర్పాట్లు చేశాయి. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా పాలనాధికారిణి నిఖిల అర్హులందరికీ టీకా అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి సర్వే నిర్వహించడంతో పాటు ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం టీకా కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయటంతో ప్రజలకు మరింత చేరువైంది. పురపాలక సంఘాల్లో కమిషనర్లకు బాధ్యతలు అప్పగించటంతో ఆయా కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు.
వార్డులు, ఉప కేంద్రాల వారీగా..
జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో వార్డులు, ఉపకేంద్రాల వారీగా వ్యాక్సిన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 99 వార్డుల్లో 97 చోట్ల, 154 ఉపకేంద్రాలు ఉండగా 139 ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేశారు. మరో నెల రోజుల్లో వంద శాతం టీకాల నమోదు పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యం పెట్టుకోగా జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 23,600 టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటింటికీ వ్యాక్సిన్‌ ప్రారంభించిన మొదటి 6 (ఈనెల 16 నుంచి 21 వరకు) రోజుల్లో 64,981 మందికి వేశారు. ఈ నెల 16న 22.శాతం, 17న 34.2, 18న 48.2 ,19న 33, 20న 11.1, 21న 50.2 శాతం నమోదైంది.
అర్హులందరూ వేసుకోవాలి..
-డాక్టర్‌ తుకారాంభట్‌, జిల్లా వైద్యాధికారి,వికారాబాద్‌

జిల్లాలో అర్హులందరికీ వందశాతం టీకాలు వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వ్యాక్సిన్‌ కొరత రాకుండా, సరఫరాలో జాప్యం జరగకుండా చూస్తున్నాం. ఎంపిక చేసిన కేంద్రాల్లో అందుబాటులో వ్యాక్సిన్‌ ఉందని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని