గుర్తించని ప్రాధాన్యం.. కేటాయింపులు అధ్వానం
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

గుర్తించని ప్రాధాన్యం.. కేటాయింపులు అధ్వానం

 పురపాలికల్లో నిధులు దుర్వినియోగం
 పనులపై అధికారుల, ప్రజా ప్రతినిధుల ప్రభావం
 ఊసురోమంటున్న విలీన గ్రామాలు
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

వికారాబాద్‌లో ఉన్న రోడ్డుపైనే మరో మారు సిమెంటు రోడ్డు వేసేందుకు మ్యాన్‌ హోల్‌ తవ్వకం

* వికారాబాద్‌ పురపాలక సంఘానికి చెందిన ఓ కౌన్సిలర్‌ తన ఇంటి చుట్టూ ఉన్న పాత సిమెంటు రహదారులపై మట్టిని శుభ్రం చేస్తే సరిపోతుంది. కానీ మరో మారు కొత్తగా రహదారులను వేయించుకున్నారు. దీంతో గ్రామంలోని ఇతర కాలనీల ప్రజలు మా వీధిలో మట్టిరోడ్డుకే దిక్కులేదు. కొందరు మాత్రం వేసిన రోడ్డుపైనే కొత్త రోడ్డు వేయించుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
* ఇదే పురపాలక సంఘానికి చెందిన మరో వార్డు పరిధిలో గతంలోనే దాదాపు 95 శాతం దారులుపై సిమెంటు రోడ్లు వేశారు. అయినా ఆ కౌన్సిలర్‌ తనకు అందరితో సమానంగా నిధులు కేటాయించాలని పట్టుబట్టి తీసుకున్నారు. ఉన్న రోడ్లపై మరోమారు సిమెంటు రోడ్డు వేయించుకున్నారు.
* తాండూరు పట్టణంలో చిన్నపాటి మరమ్మతులు చేపడితే సరిపోయే తారు రోడ్లపై రూ.10 కోట్లు వెచ్చించి సిమెంటు రహదారులు వేశారు. ఫలితంగా రహదారికి ఇరువైపులా ఉన్న వాణిజ్య దుకాణాలు కిందికయ్యాయి. వర్షం కురిస్తే దుకాణాల్లోకి నీరు చేరుతోంది. వాహనాలకు పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో ప్రధాన రహదారిపైనే నిలుపుతున్నారు. రహదారి వేసిన నెలల వ్యవధిలోనే మిషన్‌ భగీరథ పైపులైన్‌ కోసమని రహదారిని తవ్వేశారు.  
జిల్లాలో నాలుగు పురపాలక సంఘాలు, 97 వార్డులు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.70 లక్షల జనాభా నివసిస్తున్నారు. పురపాలక సంఘాల పరిధిలో అంతర్గత రహదారులు, తాగునీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనకు టీయూఎఫ్‌ఐడీసీ (తెలంగాణ పట్టణ ఫైనాన్స్‌ అండ్‌ మౌలిక వసతులు, అభివృద్ధి కార్పొరేషన్‌) నుంచి ప్రభుత్వం అప్పులు ఇప్పించింది. నాలుగు పురపాలక సంఘాలకు రూ.80 కోట్ల వచ్చాయి. ఇందులో తాండూరు, వికారాబాద్‌ పురపాలికలకు చెరో రూ.25 కోట్లు ఉండగా, పరిగి, కొడంగల్‌ పట్టణాలకు రూ.చెరో 15 కోట్లు ఉన్నాయి. వీటి వినియోగంలో పురపాలక సంఘాల పాలకవర్గం, ఇంజినీరింగ్‌ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారు. అవసరం ఉన్న చోట్ల పనులు చేపట్టడంపై శ్రద్ధ వహించడం లేదు. రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుండగా, ఇంజినీరింగ్‌ సిబ్బంది కమీషన్లతో చూసీ చూడనట్లు పోతున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో సుమారు 40 శాతం వృథాగా మారుతున్నాయి.

వార్డుల వారీగా ఇవ్వడంతోనే సమస్య
నిధుల కేటాయింపుల్లో అవసరాలకు అనుగుణంగా పనులకు మంజూరు చేయాల్సింది పోయి, ప్రాధాన్యతా క్రమాన్ని పక్కన పెట్టి వార్డుల వారీగా నిధులు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్న వార్డులకు, కొత్తగా చేరి, అసలు ఏమాత్రం అంతర్గత రహదారులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు లేని వార్డులకు ఒకే రకంగా నిధులు ఇస్తున్నారు. ఫలితంగా కొన్ని కాలనీల్లో అవసరం లేకున్నా వచ్చిన నిధులను ఏదోఒక చోట ఖర్చుపెట్టాలని పనులు చేపడుతున్నారు.  
రహదారులపైనే కుమ్మరిస్తున్నారు
జిల్లా కేంద్ర]మైన వికారాబాద్‌ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 34 వార్డులున్నాయి. ఇందులో ఇటీవలి విలీన గ్రామాలను పక్కన పెడితే 28 వార్డుల్లో దాదాపు 90 శాతం వరకు శాటిలైట్‌ టౌన్‌షిప్‌ కింద సిమెంటు రహదారులు, భూగర్భ మరుగు నీటి వ్యవస్థను నిర్మించారు. ఇలా చేసి మూడేళ్లు కావస్తోంది. కొత్తగా విలీనమైన గ్రామాలతో సమానంగా మరో మారు రోడ్డుపై రోడ్డువేస్తున్నారు. తాండూరు పురపాలక సంఘం పరిధిలో 36 వార్డులు ఉండగా, పట్టణ అభివృద్ధి నిధులు, మినరల్‌ ఫండ్‌ ఇలా అన్ని రకాలుగా రహదారులపైనే అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్నారు. పరిగిలో 15 వార్డులు, కొడంగల్‌లో 12 వార్డులు ఉన్నాయి. ఈరెండు పంచాయతీల నుంచి పురపాలక సంఘాలుగా ఏర్పాటయ్యాయి. చెరో రూ.15 కోట్లు రావడంతో ఇప్పుడిప్పుడు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇక్కడ నిధుల అవసరం ఎక్కువగా ఉంటే కేటాయింపులు తక్కువగా ఉన్నాయి.
త్వరలో మార్గదర్శనం చేస్తాం
- చంద్రయ్య, అదనపు కలెక్టర్‌

ఉన్న నిధులను ప్రాధాన్యతా క్రమంలో పనులకు కేటాయించాల్సి ఉంది. సమానంగా సర్దుబాటు చేయడంతో నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించినా ఇంజినీరింగ్‌ సిబ్బంది అవి ఎంత వరకు అవసరమో నిర్ణయించాలి. లేదనుకుంటే తిరస్కరించాలి. నాలుగు పురపాలక సంఘాల కమిషనర్లు, అధ్యక్షులతో త్వరలోనే సమావేశం నిర్వహించి కచ్చితమైన మార్గదర్శకాలు ఇస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని