మద్యం మత్తులో.. కన్నతల్లిని కడతేర్చాడు
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

మద్యం మత్తులో.. కన్నతల్లిని కడతేర్చాడు

అమ్మకు ఊపిరాడట్లేదంటూ నాటకం

ఎర్రోల్ల బలవంత్‌

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: డబ్బుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కొడుకు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం కుదావంద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఎర్రోల్ల బలవంత్‌(28) కొంతకాలంగా జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిస అయ్యాడు. మద్యం తాగి వచ్చి భార్య రమాదేవిని తరచూ వేధించడంతో రెండేళ్ల క్రితం ఇద్దరు కుమారులను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తల్లి భీమమ్మ (55)ను డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టాడు. నెలనెలా ఆమెకు వచ్చే వితంతు పింఛను కోసం ఇబ్బందులు పెట్టేవాడు. ఈక్రమంలో శుక్రవారం తల్లికి పింఛను డబ్బులు వచ్చిన విషయం తెలుసుకున్నాడు. రాత్రి ఆమెతో గొడవ పడి వెయ్యి రూపాయలు తీసుకుని వెళ్లి మద్యం తాగి వచ్చాడు. మళ్లీ డబ్బులు కావాలని గొడవ పడుతూ విద్యుత్‌ తీగను గొంతుకు చుట్టి శ్వాస ఆగిపోయే వరకు బిగించాడు. తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఏమీ తెలియనట్లు నటిస్తూ... ‘అన్నా అమ్మకు ఊపిరి ఆడడం లేద’ంటూ గగ్గోలు పెడుతూ.. పక్కింట్లో ఉంటున్న (చిన్నమ్మ కొడుకు) అన్న భాస్కర్‌కు తెలిపాడు. సాయంత్రం వరకు బాగున్న ఆమెకు ఏమైందని చుట్టు పక్కల వారితో కలిసి అక్కడికి వెళ్లి చూశాడు. ఆమె మెడకు విద్యుత్తు తీగ కనిపించడందో తమ్ముడిపై అనుమానంతో తెల్లారే వరకు ఓపిక పట్టాడు. శనివారం ఉదయాన్నే గ్రామ సర్పంచికి, పోలీసులకు సమాచారం అందజేశాడు. తాగిన మత్తులో తల్లి మెడకు బిగించిన విద్యుత్తు తీగను మరిచి పోయి బలవంత్‌ అడ్డంగా దొరికి పోయాడు. రైతుబీమా కోసమే తల్లిని హతమార్చాడని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ లక్ష్మిరెడ్డి, ఎస్సై క్రాంతి కుమార్‌ నిందితుడిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని