తప్పిదం పునరావృతమైతే చర్యలే..!
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

తప్పిదం పునరావృతమైతే చర్యలే..!

 ఉపాధ్యాయుల సంజాయిషీపై డీఈఓ అసంతృప్తి
 14 మందికి ఉత్తర్వుల జారీ

తరగతి పైకప్పును చూస్తున్న రేణుకాదేవి

బషీరాబాద్‌: బషీరాబాద్‌ మండలం గొట్టిగకుర్దు, నవల్గా ఉన్నత పాఠశాలలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులతో పాటు 18 మంది ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు హాజరు కాకపోవడం ఈనెల 9న ‘బడి వేళ.. జాగేలా’ అని ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై పాలనాధికారిణి, జిల్లా విద్యాధికారిణి తీవ్రంగా స్పందించారు. అదే రోజు డీఈఓ రెండు పాఠశాలలను సందర్శించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదని నిర్ధారణ కావడంతో వారికి తాఖీదులు జారీ చేసి, వెంటనే సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నలుగురి సంజాయిషీతో సంతృప్తి చెందగా, 14 మంది ఉపాధ్యాయుల సంజాయిషీపై డీఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మరోసారి విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాంటి తాఖీదులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు జిల్లా పాలనాధికారిణి ఆదేశించారు. అందుకు అనుగుణంగా హెచ్చరిక ఉత్తర్వులు జారీ చేసినట్లు’ జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) రేణుకాదేవి తెలిపారు.

భవనాలను పరిశీలించిన డీఈఓ 

పెద్దేముల్‌: పెద్దేముల్‌లోని ప్రాథమిక పాఠశాల తరగతి గదులను జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) రేణుకా దేవి శనివారం పరిశీలించారు. శుక్రవారం ఈనాడులో ‘తరగతి ఇదీ..’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. అందుకు జిల్లా విద్యాధికారిణి స్పందించి శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించి శిథిలావస్థకు చేరిన గదులను పరిశీలించారు. ఏడు గదులు ఉన్నా రెండు గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు వివరించారు. తరువాత పక్కనే ఉన్న బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడ అదనంగా ఉన్న మూడు తరగతి గదులను చిన్నారులకు కేటాయించాలని  ప్రధానోపాధ్యాయురాలు మల్లమ్మను ఆదేశించారు. చీకట్లో పాఠాలు ఎలా బోధిస్తున్నారని ఆమెను ప్రశ్నించారు. పాఠశాల అభివృద్ధికి నిధులు లేవా అని అడిగారు. ఉన్నాయని ఆమె తెలపడంతో.. ఇదేం పద్ధతి నిధులు ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నీ మరిచి పోయారా...

ప్రాథమిక, బాలుర, బాలిక ఉన్నత పాఠశాలను డీఈఓ తనిఖీ చేశారు.ప్రాథమిక స్థాయిలో కనీసం అక్షరాలు రాకుంటే ఎలా అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించారు. బాలికల పాఠశాలలో ఆంగ్లం పాఠాలను చదివించారు. విద్యార్థులు అన్నీ మరిచిపోయారా...ఏబిసీడీలు కూడా చదవలేని స్థితిలో ఉన్నారన్నారు. తనిఖీలు చేపట్టాలని ఎంఈఓ వెంకటయ్యను ఆదేశించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని