ఆహ్లాదం.. మరింత ఆనందం
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

ఆహ్లాదం.. మరింత ఆనందం

ట్యాంక్‌బండ్‌పై 3 గంటల నుంచి ట్రాఫిక్‌ బంద్‌

హుస్సేన్‌సాగర్‌ వద్ద సందర్శకులు

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ అందాల వీక్షణకు ప్రభుత్వం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే వాహనాల రాకపోకలను నిలిపేయనుంది. ట్యాంక్‌బండ్‌పై ఇంకో రెండుగంటల పాటు ఉండేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వానికి వినతులు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. సాధ్యాసాధ్యాలపై పోలీస్‌ అధికారుల అభిప్రాయాన్ని కోరగా... తగిన ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపారు. సర్కారు ఆదేశాల ప్రకారం ఇక ప్రతి వారం మధ్యాహ్నం మూడుగంటల నుంచి సందర్శకులను మాత్రమే ట్యాంక్‌బండ్‌పైకి అనుమతించనున్నామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ శనివారం విలేకరులకు తెలిపారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు.. పరిష్కారం..

ట్యాంక్‌బండ్‌పై ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో లోయర్‌ట్యాంక్‌ బండ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లవైపు ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగాయి. ట్యాంక్‌బండ్‌ మీదుగా రాకపోకలు కొనసాగించే వాహనదారులు, సిటీబస్సులు, అంతర్రాష్ట్ర బస్సులు, సరకు రవాణా వాహనాలు, ఆటోలు ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ట్యాంక్‌, లిబర్టీ క్రాస్‌రోడ్లను ఎంచుకున్నాయి. దీంతో అటువైపు వెళ్లే వాహనాలతో ఇవి కలిసిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. గమనించిన ట్రాఫిక్‌ అధికారులు జిల్లాల ఆర్టీసీ బస్సులను గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌ మీదుగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నారాయణగూడ, కోఠీ వైపు పంపుతున్నారు. ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయన్న విషయం తెలియని ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నేరుగా ట్యాంక్‌బండ్‌ వైపు వస్తే తెలుగుతల్లి ఫ్లైవోవర్‌ మీదుగా పంపుతున్నారు.

గులాబ్‌ తుపాన్‌ ప్రభావముంటే వాయిదా

ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే ప్రారంభించనున్నామని హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. మొక్కలు, మాస్కులను ఉచితంగా పంపిణీ చేయనున్నామని వివరించారు. భారీ వర్షాలుంటే వేడుకలు వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలిపారు. విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళిగా పాటల సంగీత కచేరి ఉంటుందన్నారు.

‘సన్‌డే-ఫన్‌డే’లో షీ బృందాల ప్రదర్శన

ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ‘సన్‌డే-ఫన్‌డే’లో ఈసారి షీ బృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. మహిళల భద్రతకు షీ బృందాలు చేపడుతున్న కార్యకలాపాల గురించి అవగాహన కల్పించనుంది. ఇందుకు లీడ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌, 92.7 బిగ్‌ ఎఫ్‌ఎం, ఎరోక్‌ డ్యాన్స్‌ ఫిట్‌నెస్‌ సంస్థలు సహకారం అందించనున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని