మౌలిక వసతుల్లో మనమే మిన్న
eenadu telugu news
Published : 26/09/2021 05:19 IST

మౌలిక వసతుల్లో మనమే మిన్న

సమావేశంలో పాల్గొన్న మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, మేయర్‌ విజయలక్ష్మి, జలమండలి ఎండీ దానకిషోర్‌ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, : దేశంలో ఏ నగరంలో లేనట్లుగా మౌలిక వసతుల కల్పనలో భాగ్యనగరాన్ని మిన్నగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రుల తలసాని శ్రీనివాసయాదవ్‌, మహమూద్‌ అలీ అన్నారు.  నగరంలో తాగు, మురుగు నీటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన సందర్భంగా మంత్రులు శనివారం జలమండలి అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మంత్రులు తలసాని, మహమూద్‌ ఆలీ, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, జలమండలి ఎండీ దానకిషోర్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తొలుత తలసాని మాట్లాడుతూ.. వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగు నీటి కల్పన, మురుగు నీటి నిర్వహణ కోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.  ప్రస్తుతం నగరంలో ఉన్న 25 ఎస్‌టీపీలకు అదనంగా 31 ఎస్‌టీపీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హోంమంత్రి మహమూద్‌ ఆలీ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీ పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని కొనియాడారు.  జలమండలి ఎండీ దానకిశోర్‌ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించనున్న 31 ఎస్టీపీల్లో 21 ఎస్టీపీలు చెరువుల దగ్గరే నిర్మిస్తామని, తద్వారా చెరువులు కాలుష్యం బారిన పడకుండా ఉంటాయన్నారు.

పదిరోజుల్లో అర్హులకు ఇళ్లు 

హైదరాబాద్‌లో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో దళారుల ప్రమేయాన్ని సహించేది లేదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో రెవెన్యూ, బల్దియా, హౌసింగ్‌ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ శర్మణ్‌, బల్దియా కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఆర్డీవోలు వసంత, వెంకటేశ్వర్లు, హౌసింగ్‌ ఎస్‌ఈ కిషన్‌, ఈఈ వెంకటదాసురెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 8 ప్రాంతాలు, సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 8 ప్రాంతాల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద 3,422 ఇళ్లను నిర్మించగా అందులో 2,158 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లు చెప్పారు. ఇంకా 1264 ఇళ్ల కేటాయింపు పెండింగ్‌లో ఉందన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ చేసి అర్హులకు మిగతా వాటిని 10రోజుల్లో అందించాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని