ఉరుములేని వాన
eenadu telugu news
Published : 26/09/2021 05:19 IST

ఉరుములేని వాన

 రెండు గంటల వ్యవధిలో 10 సెం.మీ వర్షం

మణికొండ, షేక్‌పేట, ఫిలింనగర్‌, ఉప్పల్‌లో కుండపోత

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

చెరువును తలపిస్తున్న గుడిమల్కాపూర్‌ ప్రధాన రహదారి

రాజధాని నగరంలో మరోసారి వరుణుడు ఝళిపించాడు.శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య అనేక ప్రాంతాల్లో 4 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడింది. రహదారులపై ఎక్కడ చూసినా మోకాలు లోతు వరద. వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించింది. నాలాలు, డ్రైన్లు పొంగిపొర్లాయి. కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. మణికొండ, ఉప్పల్‌, షేక్‌పేట్‌, ఫిలింనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. నిండుకుండల్లా ఉన్న చెరువుల్లోకి వదర నీరు చేరడంతో శివార్లలోని దిగువ ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.  పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. అనేక మంది ఇళ్లలో నిత్యావసరాలు తడిసిపోయాయి. 

మెహిదీపట్నంలో నీట మునిగిన వాహనాలు

* భారీవర్షం నేపథ్యంలో బల్దియా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి శనివారం రాత్రి ఆదేశాలిచ్చారు.  ఏ సమస్య వచ్చినా జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కి ఫిర్యాదు చేయాలని కోరారు.

నేడూ వర్షం: నగరంలో ఆదివారం వాతావరణం మేఘావృతమై తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

రాజ్‌భవన్‌ మార్గంలో డీఆర్‌ఎఫ్‌ బృందం

ట్రాఫిక్‌ జాం.. హాహాకారం..

గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో శనివారం నగరం, శివారు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షానికి రహదారులపై ప్రయాణం అతలాకుతలమయ్యింది. కూకట్‌పల్లి-ఎల్బీనగర్‌, సికింద్రాబాద్‌-మలక్‌పేట, చార్మినార్‌-గచ్చిబౌలి  రహదారులపై కుండపోత వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు స్పందించి సాధ్యమైనంత వరకూ ట్రాఫిక్‌ చిక్కులను తొలగించారు.

మణికొండలో వ్యక్తి గల్లంతు!

నార్సింగి, న్యూస్‌టుడే: నగరంలో కురిసిన భారీవర్షంతో  శనివారం రాత్రి మణికొండ గోల్డెన్‌టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలో పడి ఓ వ్యక్తి(30)గల్లంతయ్యాడు. ఆ మార్గమంతా నీటితో నిండిపోయిన సమయంలో ఓ వ్యక్తి అటువైపుగా వెళ్లడం స్థానికులు గమనించారు. ప్రమాదం ఉందని చెబుతున్న సమయంలోనే ఆ వ్యక్తి మురుగుకాల్వలో పడి కొట్టుకుపోయినట్టు స్థానికులు తెలిపారు. నార్సింగి సీఐ గంగాధర్‌, ఎస్సై రాములు  గాలింపు చర్యలు చేపట్టారు.

వర్షపాతం మి.మీ.లలో(రాత్రి 12 గంటల వరకు

మణికొండ  105.0
షేక్‌పేట  86.0
ఫిలింనగర్‌  82.3
ఆస్మాన్‌ఘడ్‌  71.3
గచ్చిబౌలి  65.3

ఉప్పల్‌  63.8
అత్తాపూర్‌  61.00
నాచారం  60.8


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని