మంచి తరుణం.. పరిశ్రమకు ప్రోత్సాహం
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

మంచి తరుణం.. పరిశ్రమకు ప్రోత్సాహం

మహిళలు, యువతకు సదవకాశం
అండగా పీఎం ఉపాధి కల్పన పథకం
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ
నాపరాయి పరిశ్రమ

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న వారికి ఆర్థిక ప్రోత్సాహం లభించనుంది. ఉత్పత్తి, సేవా రంగాల్లో స్థిరపడాలనుకున్న ఔత్సాహికుల కల నెరవేరనుంది. పరిశ్రమల పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ పథకంతో రుణాలు అందించనున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తే రాయితీ వర్తింపజేయనున్నారు. జిల్లాలో యువతీ,యువకులు, మహిళలు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారమేర్పడనుంది. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. జిల్లాలో అమలు చేయనున్న ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...

పరిశ్రమ నెలకొల్పేందుకు జిల్లాలో ఔత్సాహికులు అనేక మంది ఉన్నప్పటికి అందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేకపోవడంతో నిరుత్సాహపడుతున్నారు. పరిశ్రమ నిర్వహించే సత్తా, నైపుణ్యం, ఉత్సాహం ఉన్నా ఉపాధి పొందలేకపోతున్నారు. ఇలాంటి వారికి అవసరమైన రుణాలను అందించి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలులోకి తెచ్చింది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం(పీఎమ్‌ఈజీపీ) పేరిట ఉత్పత్తి, సేవా రంగాల యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి రుణాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఏర్పాటు చేసే ప్రాజెక్టు అధారంగా తయారీ, ఉత్పత్తి రంగానికి రూ.25లక్షల వరకు, సేవా రంగానికి సంబంధించిన యూనిట్లకు రూ.10లక్షల దాకా రుణాలు అందించనున్నారు. రూ.5లక్షలలోపు ఎలాంటి విద్యార్హత లేకున్నా రుణం పొందే వీలు కల్పించారు. రూ.5లక్షలకుపైగా తీసుకోవాలంటే ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. రుణాలను ఐదు నుంచి ఏడేళ్లలో నెలనెలా వాయిదాల పద్ధతిన తీర్చే వెసులుబాటు కల్పించారు. 11.5శాతం వడ్డీని విధించనున్నారు. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించే లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మహిళలకు 35 శాతం, ఇతరులకు 25శాతం రాయితీ వర్తింపజేయనున్నారు. రాయితీ సొమ్మును లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో మూడేళ్లపాటు నిల్వ చేయనున్నారు. అనంతరం రాయితీ సొమ్మును అందించనున్నారు.

జిల్లావాసులకు ప్రయోజనం..: జిల్లాలో తాండూరు ప్రాంతంలో నాపరాయి నిక్షేపాలున్నాయి. ఇక్కడి నాపరాయి ఉత్పత్తులు, కోత, నునుపు యూనిట్లు నెలకొల్పేందుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆయా యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన పెట్టుబడి సొమ్ముకు కొంతమంది అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు పొందారు. ఇలాంటి వారితోపాటు కొత్తగా నాపరాయి పరిశ్రమ నెలకొల్పేవారికి తాజాగా రుణాలు పొందే అవకాశముంది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లోని 170కిపైగా గ్రామాల్లో లక్ష ఎకరాల్లో కందులు పండిస్తుండగా మంచి గిరాకీ ఉంది. వీటిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. కందులను పప్పుగా మార్చేందుకు చిన్నతరహా మిల్లుల్ని నెలకొల్పాలన్న ఆసక్తి ఉండగా తాజాగా అందించే రుణాలతో కలనెరవేర్చుకోవచ్ఛు పప్పు మిల్లులతో వినియోగదారులకు నాణ్యమైన కంది పప్పు లభించడంతోపాటు మిల్లు నిర్వహణ ద్వారా స్థానికులకు ఉపాధి లభించనుంది.

సేవా రంగంలో: వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో యువత, మహిళలు సేవా రంగం పరిధిలోకి వచ్చే అంతర్జాల కేంద్రం, అల్ఫాహార కేంద్రం, భోజన శాల, జిరాక్సు, ఆటో మోబైల్‌ సర్విసింగ్‌, నీటి సర్వీస్‌ కేంద్రాల ఏర్పాటుకు రుణాలు దక్కనుండటంతో స్వయం ఉపాధికి బాటలు పడనున్నాయి. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడగా టమాట, ఉల్లి వంటి దిగుబడులు చేతికొచ్చాక ఆహార శుద్ధి పరిశ్రమ ఏర్పాటుకుని చిప్స్‌ వంటివి తయారు చేస్తే అధిక ఆదాయం పొందడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్‌ ఏర్పడనుంది. మొత్తంగా రాయితీ రుణాలతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించడంతోపాటు ఆసక్తి ఉన్న వారి పరిశ్రమ నెలకొల్పే ఆశలు నెరవేరనున్నాయి.


సద్వినియోగంతో ప్రగతి 

వినయ్‌కుమార్‌, జీఎం, జిల్లా పరిశ్రమల కేంద్రం(డీఐసీ)

చిన్నతరహా పరిశ్రమ నెలకొల్పాలన్న ఆసక్తి ఉన్న వారు పీఎమ్‌ఈజీపీ పథకం ద్వారా రాయితీ రుణాలు పొందొచ్ఛు ఉత్పత్తి, తయారీ రంగం యూనిట్లకు రూ.25లక్షలు, సేవా రంగం యూనిట్లకు రూ.10లక్షల దాకా రుణాలు మంజూరు చేస్తాం. రుణ వాయిదాలను సకాలంలో చెల్లిస్తే 25 నుంచి 35శాతం రాయితీ వర్తిస్తుంది. యువతీయువకులు, డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.


దరఖాస్తు విధానం ఇలా..

న్‌లైన్‌ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కెవీఐసీఓఎన్‌ఎల్‌ఐఎన్‌ఈ.జీఓవీ.ఇన్‌/పీఎమ్‌ఈజీపీఈ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. ఆధార్‌, పాన్‌, విద్యార్హత ధ్రువపత్రాలు, ఏర్పాటు చేసే పరిశ్రమ సమాచారాన్ని పొందుపరచాలి. అర్జీలనే పరిశీలించి బ్యాంకు అధికారులు, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు రుణాలు మంజూరు చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని