లబ్ధిదారులపై మరింత భారం...
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

లబ్ధిదారులపై మరింత భారం...

రాయితీ గొర్రెలకు పెరిగిన యూనిట్‌ ధర

వికారాబాద్‌టౌన్‌,న్యూస్‌టుడే: కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. 2018-19లో ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలో 311 సంఘాల్లో 22,025 మంది సభ్యులు కొనసాగుతున్నారు. వీరిలో అర్హులైన సభ్యులకు తొలి విడత జీవాలను పంపిణీ చేశారు. గతంలో ఇరవై గొర్రెలు, ఒక పొటేలు యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఉండగా, ప్రభుత్వ రాయితీ రూ.83,750 మినహాయించి లబ్ధిదారులు రూ.31,250 డీడీలను అధికారులకు అందించారు. తాజాగా యూనిట్‌ ధర పెంచడంతో రెండో విడత లబ్ధిదారులు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో తొలివిడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 10,480 మంది లబ్ధిదారులు పాత ధర ప్రకారం డీడీలు చెల్లించగా, వారిలో 10,477 మందికి గొర్రెల పంపిణీ చేశారు. మిగిలిన ముగ్గురు డీడీలను తిరిగి తీసుకున్నారు. ఇంకా 11,545 మంది వీటికోసం ఎదురు చూస్తున్నారు. తొలిదశలో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని పథకంలో సర్కారు కొన్ని మార్పులు చేసింది. ధర పెంపుతో నాణ్యమైన జీవాలను అందించాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యమైన వాటిని కొనుగోలు చేసి అందించే ప్రక్రియను మరింత పకడ్బందీగా చేయడంతో పాటు, లబ్ధిదారులు జీవాలను అమ్ముకోకుండా కఠిన నిబంధనలను రూపొందించారు. పెంపకం చేపట్టలేమనుకునే వారు డీడీలు తిరిగి తీసుకునే వెసులు బాటు కల్పించనున్నారు. పంపిణీలో అక్రమాలు జరిగితే లబ్ధిదారునితో పాటు అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు అమలు చేయనున్నారు. గొర్రెల పెంపకంపై ప్రత్యేక నిఘా ఉండనుంది.


అవినీతికి తావు లేకుండా..

- సదానందం, జిల్లా పశువైద్యశాఖ ఇన్‌చార్జీ

జిల్లాలో ప్రభుత్వం పెంచిన యూనిట్‌ ధరకు అనుగుణంగా వారు అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కఠిన నిబంధనలు రూపొందించినందున లబ్ధిదారులు, పశువైద్య సిబ్బంది, అధికారులు అవినీతికి తావివ్వకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని