వేధింపులపై ఫిర్యాదులకు.. బాలల సంరక్షణ యాప్‌
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

వేధింపులపై ఫిర్యాదులకు.. బాలల సంరక్షణ యాప్‌

అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

అవగాహన పెంచుకుంటే మేలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌

రోజు రోజుకు అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై అరాచకాలు పెరిగి పోతున్నాయి. ఈ ఘటనలపై ఫిర్యాదుకు వెనుకాడు తుండటంతో నేరస్థులు శిక్ష నుంచి తప్పించు కోగలుగుతున్నారు. చాలామంది భయపడి ఫిర్యాదులు చేయడం లేదు. కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా నేరం చేసిన వారి నుంచి వేధింపులకు గురవుతున్నారు.ఇలాంటి వారికి న్యాయం చేయడంతో పాటు నేరగాళ్లను శిక్షించడానికి, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం పోక్సో ఈ బాక్స్‌ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీన్ని వినియోగించి నిందితులపైకఠిన చర్యలు తీసుకుంటారు.

యువత బాధ్యత..

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా చరవాణి ఉంటోంది. అనవసరమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే యువత తీరు మారాల్సి అవసరముంది. బాలికలు, మహిళల సంరక్షణ కోసం ఈ యాప్‌ను యువత తమ చరవాణీల్లో ఇన్‌స్టల్‌ చేసుకోవడం ముఖ్యం. బాధ్యత గల పౌరుల్లా లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనలు తెలిస్తే వెంటనే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

తీరు మారాలి..

పుట్టగానే ఎవరూ నేరస్థులు కారు. పెరిగిన వాతావరణం.. కొన్ని పరిస్థితులు వారిని అలా మారుస్తుంటాయి. ఇంట్లో మగపిల్లలను పెంచే విధానంలో మార్పు రావాలి. శారీరకంగా మానసికంగా ఎవరినీ హింసించకూడదనే భావన చిన్నప్పటి నుంచే వారిలో కల్పించాలి. పిల్లల పెంపకం, వారిపై దృష్టి సారించకపోతే ఎన్ని చట్టాలు తెచ్చినా లైంగిక వేధింపులు ఆపడం సవాలే అవుతుంది.

దిల్లీ కేంద్రంగా చర్యలు..

కేంద్ర ప్రభుత్వం బాలికలకు భరోసాను కల్పించేందుకు దేశ రాజధాని కేంద్రంగా చర్యలు ప్రారంభించింది. బాధితులు చేసిన ఫిర్యాదులను ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి సమాచారం ఇస్తారు. బాలల సంరక్షణ అధికార సిబ్బందీ సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారం కూడా తెలియదు. దీంతో వందశాతం పారదర్శకతతో విచారణ జరిపి పోలీసుల సహకారంతో కేసును నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు విచారణ కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదు దారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది.


ఫిర్యాదు చేసే విధానం ఇలా..

గూగుల్‌ ప్లే స్టోర్‌లో పీఓసీఎస్‌ఓ ఈబీఓఎక్స్‌ (పోక్సో ఈ బాక్స్‌) అని టైప్‌ చేస్తే యాప్‌ కనిపిస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకొని తెరవాలి. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీపీసీఆర్‌.జీఓవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ తెరవగానే వృత్తంలో ఫొక్సో ఈ బాక్స్‌ అని వృత్తాకారంలో కనిపిస్తుంది. ఫిర్యాదు చేయాలంటే దాన్ని క్లిక్‌ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. వారిపై జరిగిన అఘాయిత్యం, జరిగేందుకు ఆస్కారమున్న ఆరు ప్రాంతాలు, ఆటస్థలం, దుకాణం, రహదారి మీద, పాఠశాల లేదా పాఠశాలకు వాహనాల్లో, బహిరంగ ప్రదేశాల్లో బాలికలతో అనుచిత ప్రవర్తన, శరీర భాగాలను చిత్రాల రూపంలో పెట్టారు. హింసా స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్‌ చేయాలి. అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితులు, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను పత్రంలో పొందుపర్చి సమర్పించాలి.


నేరాలకు అడ్డుకట్ట..

- ప్రమీల, సీఐ, మహిళా పోలీస్‌ఠాణా, వికారాబాద్‌

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్‌తో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్ఛు దీనిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. దేశ పౌరులుగా జరుగుతున్న అన్యాయాలను వెంటనే చిత్రీకరించి యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసి బాధితులకు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలి. యాప్‌లో నమోదైన ఫిర్యాదులను ప్రభుత్వం పోలీసుశాఖకు చేరవేస్తుంది. వాటి ఆధారంగా కేసులను నమోదు చేసి నిందితుల ఆట కట్టిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని