ప్రమాదవశాత్తు జలాయశంలో పడి వ్యక్తి మృతి
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

ప్రమాదవశాత్తు జలాయశంలో పడి వ్యక్తి మృతి

రెడ్డమైన స్వామి

ములుగు: కొండపోచమ్మ జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు. మర్కూక్‌ మండలం భవానందపూర్‌ గ్రామానికి చెందిన రెడ్డమైన స్వామి (35) అనే వ్యక్తి ఈ నెల 24న తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం కొండపోచమ్మ జలాశయంలో చేపలు పట్టేందుకు వచ్చి వల వేసి ఉంచారు. రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వలలో పడిన చేపలను తీసుకొచ్చేందుకు మళ్లీ వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో పడిపోయాడు. స్వామి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. ఆదివారం జలాశయంలో ఓ మృతదేహం తేలింది. విషయం తెలుసుకున్న ములుగు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుని ఆచూకి కోసం ప్రయత్నించగా స్వామిగా గుర్తించారు. మృతుని భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.


వెంటాడిన జైలు భయం...

ములుగు చెరువులో దూకి యువకుడి ఆత్మహత్య

తాడెం సుధాకర్‌

ములుగు, న్యూస్‌టుడే: తనపై నమోదైన పోలీసు కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ములుగులో జరిగింది. ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల మేరకు ములుగుకు చెందిన తాడెం సుధాకర్‌ (30) అనే యువకుడు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అక్కడ గజ్వేల్‌కు చెందిన కొందరితో గొడవ జరిగింది. ఈ విషయమై గజ్వేల్‌ ఠాణాలో సుధాకర్‌పై ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కోసం అతడిని ఠాణాకు పిలిపించి ఆదివారం మళ్లీ రావాలని వదిలిపెట్టారు. ఈ విషయంలో తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిన సుధాకర్‌ ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి గ్రామానికి సమీపంలో ఉన్న కుడి కుంట పెద్ద చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తండ్రి రాములుకు చరవాణి ద్వారా తాను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. సమీపంలోనే ఉన్న తండ్రి వద్దని పరుగులు తీస్తూ అతని వద్దకు చేరుకునే లోపే చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గజఈత గాళ్ల సహాయంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని