మెరుగులు దిద్దాలి.. పరుగులు పెట్టాలి
eenadu telugu news
Published : 27/09/2021 03:07 IST

మెరుగులు దిద్దాలి.. పరుగులు పెట్టాలి

ఆదర్శంగా రాజస్థాన్‌ టూరిజం పోలీస్‌

ప్రపంచ పర్యాటక దినోత్సవం నేడు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గోల్కొండ, చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చౌమహల్లాప్యాలెస్‌ ఇలా అనేక చారిత్రక కట్టడాలు మన వారసత్వ సంపద. ఇవి భాగ్యనగర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేశాయి. పర్యాటకపరంగానూ ఆకర్షిస్తూ ఆదాయం అందిస్తున్నాయి. వీటిని నిరంతరం పర్యవేక్షిస్తూ కట్టడాలకు అనుగుణంగా మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు అనేక నిర్మాణాలను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. రాజస్థాన్‌ వంటి ఇతర రాష్ట్రాలు ఇలాంటి కట్టడాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటే అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న భాగ్యనగరంలో ఈ మేరకు సదుపాయాల కల్పన జరగడం లేదు.

అక్కడ వెంటనే స్పందించేలా..

పర్యాటకుల భద్రతే లక్ష్యంగా రాజస్థాన్‌ ప్రభుత్వం టూరిజం పోలీస్‌ను ప్రవేశపెట్టింది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే స్పందించేలా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఫిర్యాదు చేస్తే వెనువెంటనే చర్యలు చేపట్టడంతో పర్యాటకుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. సమాచారం అందివ్వడం, వ్యక్తిగత భద్రత, దొంగతనాలు జరగకుండా చూడటంతో అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది.

బొటిక్‌ హోటళ్లతో ఉపాధి..

చాలా వరకు చారిత్రక కట్టడాలు పాతనగరంలోనే ఉన్నాయి. విదేశీ, ఇతర రాష్ట్రాల పర్యాటకులు అక్కడ ఉండేందుకు సరైన సదుపాయాలు లేవు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న రాజస్థాన్‌ పర్యాటకులను ఆకర్షించేందుకు బొటిక్‌ హోటల్‌ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. పర్యాటక ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఆతిథ్యంపై శిక్షణ అందించి వాళ్ల ఇళ్లలో ఖాళీగా ఉండే గదులను బొటిక్‌ హోటళ్లుగా మార్చేశారు. పర్యాటకులు అక్కడికి వచ్చినప్పుడు ఓ గదిని అవసరమైనన్ని రోజులు అద్దెకిస్తారు. ప్రాంతీయ రుచులను అందిస్తారు. దీంతో అక్కడి మహిళలకు ఉపాధితో పాటు ఆదాయ మార్గాలను అందించారు. వైద్య సదుపాయాలు కల్పించారు. మరోవైపు కార్లు వెళ్లలేని గల్లీల్లో ఈ హోటళ్లుంటే ఆటోరిక్షాల ద్వారా పర్యాటకులను పికప్‌ అండ్‌ డ్రాప్‌ సదుపాయాలను కల్పిస్తున్నారు. పాతనగరంలోనూ ఈ ప్రణాళిక అమలైతే పర్యాటక ఆకర్షణతో పాటు, అక్కడి వాళ్లకు ఆదాయ మార్గాలు అందించినట్టవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని