ఉల్లంఘిస్తే.. సామాజిక దండన
eenadu telugu news
Updated : 27/09/2021 11:39 IST

ఉల్లంఘిస్తే.. సామాజిక దండన

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో పౌరుల ఫిర్యాదులు
ఫొటోలు పరిశీలించి.. చలాన్లు జారీ చేస్తున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

ట్రాఫిక్‌ పోలీసులు.. కెమెరాల్లేవ్‌ అనుకుంటూ జోరుగా రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా?.. నంబర్‌ ప్లేట్‌లో అంకెను మార్చి దూసుకెళ్తున్నారా?.. ఇకపై జాగ్రత్త ట్రాఫిక్‌ పోలీసులు, సీసీ కెమెరాలు లేకపోయినా సరే యువకులు, నెటిజన్లు చూస్తున్నారు. మీ ఉల్లంఘనల చిత్రాలను ట్విటర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా పోలీసులకు పంపుతున్నారు. వీటి ఆధారంగా ఉన్నతాధికారులు పరిశీలించి ఈ-చలాన్‌లు జారీ చేస్తున్నారు.

రాజధాని రోడ్లపై కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పోలీస్‌ ఉన్నతాధికారులకు వందల సంఖ్యలో ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, పోలీస్‌ వెబ్‌సైట్ల ద్వారా ప్రశ్నించడంతో వారు స్పందించారు. నిబంధనలు అందరికీ వర్తిస్తాయని... ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేస్తున్నారు.నెలకు సగటున రెండువేల ఫిర్యాదులొస్తున్నాయని పోలీసులు తెలిపారు.

ఇష్టారాజ్యంగా డ్రైవింగ్‌ అంటే కుదరదు..

కొందరు వ్యక్తులు రహదారులకు అడ్డంగా వాహనాలు నిలపడం, అపసవ్యదిశలో వేగంగా వస్తుండడం వంటివి చేస్తున్నారు. కొందరు బస్సు డ్రైవర్లు బస్‌స్టాప్‌లలో కాకుండా రహదారి మధ్యలో ఆపుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నచోట జరిమానాలు విధిస్తున్నా... వారు లేనిచోట కొందరు పౌరులే ఆయా వాహనాల ఫొటోలు తీసి నేరుగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ వెబ్‌సైట్లలోకి చిత్రాలను పంపుతున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపారు... చర్యలు తీసుకోరా? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వీరు పంపుతున్న వీడియోలు, ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫలానా వారికి జరిమానా విధించాం.. కృతజ్ఞతలంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తున్నారు.

ఖాకీలపైనా ఫిర్యాదులు..

పోలీసులైనా సరే... చట్టం.. చట్టమేనంటూ వారికీ జరిమానాలను విధించడమే కాకుండా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ ఉన్నతాధికారులు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలంటూ పోలీస్‌ అధికారులకు గట్టిగా హెచ్చరించారు. అప్పటి నుంచి బీట్‌ కానిస్టేబుళ్లు, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది శిరస్త్రాణం ధరించే ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని