రెండో రోజూ నిరాశే
eenadu telugu news
Published : 27/09/2021 03:07 IST

రెండో రోజూ నిరాశే

మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌?

డ్రైనేజీ పైపుల్లో గాలిస్తున్న సహాయక బృందం

నార్సింగి న్యూస్‌టుడే: మణికొండలో వరదకు కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ రెండో రోజూ దొరకలేదు. సుమారు వంద మంది వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీఆర్‌ఎఫ్‌, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఆదివారం రాత్రి వరకు గాలించినా ఫలితం లేదు. సోమవారం కొనసాగించాలని నిర్ణయించారు. గల్లంతైంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా అనుమానిస్తున్నారు.

అసలేం జరిగింది... మణికొండలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు సెక్రటేరియట్‌ కాలనీ గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యాన్‌హోల్లోకి చేరింది. రాత్రి 9.15గం.ల సమయంలో కాలినడకన అటువైపుగా వెళ్తున్న వ్యక్తి అందులో పడి గల్లంతయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా రికార్డ్‌ అయ్యింది. ఇది వైరల్‌ కావడంతో నార్సింగి పోలీసులు, మణికొండ మున్సిపల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకారంతో డ్రైనేజి పొడవునా వెదికినా గల్లంతయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్‌ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. గాలింపు చర్యలను మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ పర్యవేక్షించారు. గల్లంతయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. అతను మా కుటుంబ సభ్యుడేనని ఎలా చెబుతారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు వీడియో తీసిన వ్యక్తి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని