ఆగిన లారీని ఢీకొట్టిన కారు
eenadu telugu news
Published : 27/09/2021 03:37 IST

ఆగిన లారీని ఢీకొట్టిన కారు

ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

తిప్పర్తి: ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై తిప్పర్తిలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్బర్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ అబ్ధుల్‌ రవూఫ్‌ (37), పాతబస్తీకి చెందిన మేరాజ్‌, యూనుస్‌, డ్రైవర్‌ సమివుద్దీన్‌ స్నేహితులు. నలుగురు కలిసి విహారయాత్ర కోసం ఈనెల24న కారులో చీరాల, గుంటూరు, బాపట్ల తదితర ప్రాంతాలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఆదివారం తెల్లవారుజామున తిప్పర్తి హెచ్‌పీ పెట్రోల్‌ బంకు వద్దకు రాగానే.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులోని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సయ్యద్‌ అబ్ధుల్‌ రవూఫ్‌ మృతిచెందాడు. మేరాజ్‌, యూనుస్‌, సమివుద్దీన్‌ చికిత్స పొందుతున్నారు. వర్షం కురుస్తుండటంతో ఆగి ఉన్న లారీ కనబడకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

మరో ఘటనలో వ్యక్తి..

బీబీనగర్‌, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్‌ వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం దౌకుంటపల్లికి చెందిన కార్పెంటర్‌ వడ్రోజు బాల్‌రాజ్‌(42) పదేళ్లుగా గోల్నాకలో ఉంటున్నారు. శనివారం బాల్‌రాజ్‌ తన భార్య, కుమార్తెతో కలిసి రాజపేట మండలం బసంతపురంలోని అత్తగారింటికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా గూడూరు టోల్‌ప్లాజా సమీపంలో లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో బాల్‌రాజ్‌ అతడి భార్య భార్గవి, కుమార్తె దివ్యకు గాయాలయ్యాయి. బాల్‌రాజ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. భార్గవి, దివ్యకు స్వల్ప గాయాలవడంతో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


రైలు ఢీకొని హోంగార్డు దుర్మరణం

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: పట్టాలు దాటుతున్న ఓ హోంగార్డును వేగంగా వచ్చిన రైలు ఢీకొనగా పక్కనే ఉన్న పొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. తార్నాక విజయ డెయిరీ ప్రాంతంలోని బాలాజీ అపార్టుమెంట్‌లో ఉంటున్న సీహెచ్‌.శ్రీహరి(52) పెట్లబుర్జ్‌ పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య లీలావతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రయినా రాలేదు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండటంతో కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికారు. అదే రోజు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం రైలు పట్టాల ప్రాంతంలో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా మౌలాలి - లాలాగూడ స్టేషన్ల మధ్య పొదల్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

లేక్‌ ఠాణా హోంగార్డు సస్పెన్షన్‌

బన్సీలాల్‌పేట: లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కే కిషన్‌ నాయక్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ అతన్ని తప్పిస్తూ నగర సాయుధ విభాగం హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని సూచించారు.


అంతు చిక్కని చోరీ కథ

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: స్థిరాస్తి వ్యాపారికి చెందిన రూ.55లక్షలతో పరారైన డ్రైవర్‌ శ్రీనివాస్‌ వ్యవహారంలో జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడి కుటుంబీకులు, స్నేహితులు, బంధువుల వివరాలు సేకరించే పనిలోపడ్డారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని దొడ్ల భవనం ముందు కారు వదిలేసి ఆటో ఎక్కిన శ్రీనివాస్‌ అమీర్‌పేట వరకు వెళ్లినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. వెయ్యికి పైగా సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అదే ఆటో నల్లకుంటలోనూ కన్పించడంతో అక్కడి ఫుటేజీ పరిశీలిస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌ విడిచి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని