స్తంభంపైనే విద్యుత్తు ఉద్యోగి ఊపిరి ఆగింది
eenadu telugu news
Updated : 27/09/2021 06:02 IST

 స్తంభంపైనే విద్యుత్తు ఉద్యోగి ఊపిరి ఆగింది


స్తంభంపై వేలాడుతున్న దుర్గాప్రసాద్‌

మూసాపేట, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ఓ ఉద్యోగి విద్యుత్తు స్తంభంపైనే ప్రాణాలొదిలాడు. కూకట్‌పల్లి పోలీసుల వివరాల మేరకు.. జనగామ జిల్లా బచ్చనపేటకు చెందిన దుర్గాప్రసాద్‌ (30) టీఎస్‌పీసీఎల్‌ ఉద్యోగి. కూకట్‌పల్లిలో ఉంటున్న ఇతను కూకట్‌పల్లి సెక్షన్‌ ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ (ఎఫ్‌ఓసీ) విభాగంలో మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అవివాహితుడు కావడంతో కార్యాలయ గదిలోనే ఉంటున్నాడు. వెంకట్రాయనగర్‌లోని ఓ ఇంట్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగడంతో వినియోగదారుడి ఫిర్యాదు మేరకు మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి అతను ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కడికి వెళ్లాడు. నియంత్రికను ఆఫ్‌ చేశాక అతను స్తంభంపైకి ఎక్కాడు. అయితే ఆ సమయంలో ఉన్నట్లుండి విద్యుదాఘాతం సంభవించడంతో దుర్గాప్రసాద్‌ స్తంభంపైనే ప్రాణాలొదిలాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బంధువులకు సంస్థ ఉద్యోగులు సమాచారం అందించలేదు. దుర్గాప్రసాద్‌కు సీరియస్‌గా ఉందని చెప్పడంతో రాత్రి సమయంలో ఆసుపత్రికి వచ్చారు. అప్పటికీ సంస్థ ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్‌ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు. కూకట్‌పల్లి ఏసీపీ ఎ.చంద్రశేఖర్‌, సీఐ టి.నర్సింగ్‌రావు తదితరులు ఘటనా స్థలికి చేరుకుని వారిని సముదాయించారు. కాగా నియంత్రికను ఆఫ్‌ చేసినా విద్యుత్తు సరఫరా అవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్గాప్రసాద్‌ తండ్రి రాములు ఇటీవలే మృతిచెందాడు. తల్లి రాజమని, సోదరుడు సొంతూరులో ఉంటున్నారు.


విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే : విద్యుదాఘాతానికి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన అమీన్‌పూర్‌ పట్టణంలో ఆదివారం జరిగింది. గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీలో ఉండే చావలి సుజయ్‌ పెద్ద కుమారుడు అనిరుద్‌(14) పదో తరగతి చదువుతున్నాడు. ఇతనికి బాక్సింగ్‌ అంటే ఇష్టం. ఇంటి వద్ద సాధన చేసేందుకు స్థలం సరిగ్గా లేకపోవడంతో బందంకొమ్ములో ఉన్న బంధువులో ఇళ్లు ఖాళీగా ఉండటంతో అక్కడికి వెళ్లాడు. ఇంటి గదిలో ఉన్న నీటిని శుభ్రం చేస్తుండగా విద్యుదాఘానికి గురై కుప్పకూలిపోయాడు. తండ్రి ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్లి చూడగా పడిపోయి ఉన్న కుమారుడిని చూసి వెంటనే అశోక్‌నగర్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి సుజయ్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని