Hyderabad: ‘గులాబ్‌’ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం
eenadu telugu news
Updated : 27/09/2021 19:35 IST

Hyderabad: ‘గులాబ్‌’ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా కుండపోత వర్షం

హైదరాబాద్: గులాబ్‌ తుపాను తీవ్రత తెలంగాణపై చూపిస్తోంది. తుపాను ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వనస్థలిపురం, ఎల్బీనగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డి నగర్‌, తుర్కయాంజాల్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌,  కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, నారాయణగూడా, హిమాయత్‌నగర్, లక్డికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం, చార్మినార్‌, చంద్రాయానగుట్ట, బహదూర్‌పురా, యకుత్‌పురా తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది.

బొరబండ, అల్లాపూర్, మోతీ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఈఎస్‌ఐ, వెంగల్ రావు నగర్, రహమత్ నగర్, అమీర్‌పేట, మైత్రివనం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, అల్విన్‌ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతి నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం  పడింది భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జూబ్లీహిల్స్-హైటెక్ సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది.

ఏ సమస్య ఉన్నా డయల్‌ 100: హైదరాబాద్‌ సీపీ విజ్ఞప్తి

మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ హెచ్చరించారు. నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. ఎలాంటి సమస్య ఉన్నా డయల్ ‌100కి ఫోన్‌ చేయవచ్చని సూచించారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీపై దృష్టిపెట్టినట్టు చెప్పిన ఆయన.. పోలీస్‌ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ఇద్దరు అధికారులతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి సాయం కోసమైనా హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌  040-23202813ను సంప్రదించాలని సూచించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని