మరమ్మతు జాప్యం.. ప్రజలకు శాపం
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

మరమ్మతు జాప్యం.. ప్రజలకు శాపం

అడుగులోతు గుంతలతో అవస్థలు

కంకరపోసి వదిలేసిన నస్కల్‌ రోడ్డు

న్యూస్‌టుడే,పరిగి: రెండు మండలాలకు ప్రధాన రహదారి.. ఆ మార్గంలో ప్రయాణమంటేనే ప్రజలు వణికిపోతున్నారు. వెన్ను నొప్పులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. అడుగు లోతు గుంతలు పడినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే.. ఇంతకీ ఈ దారుణ పరిస్థితి ఎక్కడ అనుకుంటున్నారా జిల్లాలోని పరిగి -దోమ మండల కేంద్రం సుల్తాన్‌పూర్‌, బాసుపల్లి రోడ్డు దుస్థితి ఇది. ఆటోలు తరచూ మరమ్మతుకు గురవడంతో వాహన చోదకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మార్గం బాగాలేదని పరిగి నుంచి రాఘవాపూర్‌ మీదుగా వెళ్లాలన్నా అది కూడా ఆరు కిలోమీటర్లు నరకప్రాయంగానే మారింది. మరమ్మతులో జరుగుతున్న జాప్యం శాపంగా మారింది. రోడ్డు మరింత అధ్వానంగా మారితే బస్సులను నడపలేమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ నుంచి దోమ మండలం బాసుపల్లి ప్రధాన రహదారి వరకు మొత్తం 13.8కి.మీ. అందులో రెండేళ్ల కిందట 6.5కిలోమీటర్ల రోడ్డును విస్తరించి బాగు చేశారు. మిగతా 7.3 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా మారింది. విస్తరించేందుకు నిధులు లేకపోవడంతో ఉన్న రోడ్డుకే మరమ్మతు చేసైనా అవస్థలు తీర్చాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. గతంలోనే విస్తరణ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి రూ.2కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపారు. ఆమోదముద్ర పడకపోవడంతో పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. ప్రస్తుతం ఏదో విధంగా పనులు చేసినా సింగిల్‌ రోడ్డుకే పరిమితం కానుంది. ఇరువైపులా అటవీ ప్రాంతం ఉండటంతో ఎదురెదురుగా వాహనాలు వస్తే మళ్లీ అవస్థలే. ఇది గతంలో మంజూరైన రోడ్డు అయినప్పటికీ బిల్లుల మంజూరులో పెడుతున్న కొర్రీలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రెండు మండలాలకు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు.

గుత్తేదారులకు గుబులు: చేసిన పనులకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో గుత్తేదారులను గుబులు వెంటాడుతోంది. పరిగి నుంచి షాద్‌నగర్‌ రూట్లో మరమ్మతు పనులకు గతేడాది కేవలం రూ.9లక్షలు మంజూరయ్యాయి. కానీ ఇప్పటివరకు నిధుల లేమితో టెండర్లు పిలవలేదని తెలిసింది. ఒక్క పరిగి సబ్‌ డివిజన్‌ పరిధిలోనే రూ.5కోట్లకు పైగా ఏడాది కాలంగా పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి. వీటి కోసం నిత్యం వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో విడుదల కావాల్సి ఉంది. దీంతో ఎవరు కూడా కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. పరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి నస్కల్‌ రోడ్డు సుమారు 1.5కి.మీ, పూడూరు మండలం మంచన్‌పల్లి నుంచి గట్టుపల్లి వరకు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నిధులు మంజూరు కాకపోవడంతో నిలిచిపోయాయి. పరిగి నుంచి రాఘవాపూర్‌ వరకు రెండు వరుసల రోడ్డు అడుగడుగునా గుంతలు పడింది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఇదే దారి. దీంతో నిత్యం వెళ్లే మహారాష్ట్ర, కర్ణాటక వాసులకు ఇబ్బందులు తప్పడంలేదు.


పదేళ్లుగా ఇదే తీరు


నాగులపల్లి వంతెన వద్ద ఇదీ పరిస్థితి

న్యూస్‌టుడే,పెద్దేముల్‌: మండల కేంద్రం పెద్దేముల్‌ నుంచి తండా మీదుగా నాగులపల్లి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. పదేళ్ల క్రితం కంకర రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. పది గ్రామాల ప్రజలకు అనువైన మార్గం కావడంతో రాకపోకలు ఎక్కువయ్యాయి. పదేళ్లుగా మరమ్మతు లేకపోవడంతో చిన్న గుంతలు పెద్దగా మారాయి. వానకాలంలో ఈ రోడ్డుపై ప్రయాణం ఇబ్బందులకు గురి చేస్తోంది. భారీ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు వెళ్లలేని స్థితి నెలకొంది. ఈ దారిలో పెద్దేముల్‌, పెద్దేముల్‌ తండా, రుద్రారం, నర్సాపూరు, తట్టేపల్లి, బండమీదిపల్లి, సిద్దన్నమడుగు తండా, ఎర్రగడ్డ తండా, ఓమ్లానాయక్‌ తండా, పాషాపూరు, అడ్కిచర్ల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పదేళ్లు గడుస్తున్న కనీస మరమ్మతులు చేపట్టడం లేదు. పంచాయతీ రాజ్‌ శాఖ అదికారులు రోడ్డు గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రోడ్డు మరమ్మతుకు ప్రతిపాదనలు పంపించామని పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ సిద్ధార్థ తెలిపారు.


వచ్చే నెలలో పనులు ప్రారంభం

- బి.సురేందర్‌, డీఈ, రోడ్లు,భవనాల శాఖ

వీలైనంత త్వరగా సుల్తాన్‌పూర్‌ -బాసుపల్లి రోడ్డుతో పాటు దెబ్బతిన్న ఇతర రహదారులను బాగు చేయిస్తాం. వర్షాల కారణంగా పనులకు అంతరాయం కలుగుతోంది. తగ్గుముఖం పట్టగానే పనులు ప్రారంభించేలా కృషి చేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని