గులాబ్.. సబ్ తలాబ్
eenadu telugu news
Updated : 28/09/2021 09:29 IST

గులాబ్.. సబ్ తలాబ్

ముంపు బారిన 600 కాలనీలు

నదులను తలపించిన దారులు

బహదూర్‌పుర నుంచి కిషన్‌బాగ్‌ వెళ్లే రోడ్డులో నడుము లోతు వరకు వరద రావడంతో ప్రజల అవస్థలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు-హైదరాబాద్‌: ఏకధాటిగా కురిసిన వర్షంతో రాజధానిలోని వేలాది కాలనీలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. సోమవారం రోజంతా విడువకుండా కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపించాయి. చెరువులు నిండి ఎప్పుడు ఏ కట్ట తెగి కాలనీని ముంచెత్తుందోనంటూ లక్షలాది మంది ఆందోళనలో మునిగిపోయారు. పాతబస్తీ నుంచి మొదలుపెడితే మాదాపూర్‌, అత్తాపూర్‌ వరకు దాదాపు 600 కాలనీలో ముంపులో చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉన్నా సాయంత్రం నుంచి రాత్రి వరకు దంచికొట్టింది. దీంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్‌ స్తంభించింది. లక్షలాది మంది వాహనదారులు కొన్నిగంటలపాటు రోడ్ల మీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర మోకాలి లోతు నీరు చేరడంతో మూడు గంటలపాటు ట్రాఫిక్‌ స్తంభించింది.


కిషన్‌బాగ్‌లో తాళ్ల సాయంతో వెళ్తున్న స్థానికులు

సెల్లార్లలోకి నీరు చేరడంతో ఆందోళన

అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 11.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నగరంలోని వందలాది అపార్టుమెంట్లలో వరదనీరు చేరింది. ముఖ్యంగా సెల్లార్లలో భారీగా వరదనీరు చేరి వాహనాలు మునిగిపోయాయి. సెలార్లలో విద్యుత్తు మీటర్లు ఉండటంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా నిలిచి చీకట్లోనే కాలం గడుపుతున్న పరిస్థితి. మాదాపూర్‌లోని నెక్టార్‌గార్డెన్‌, అమర్‌సొసైటీ పూర్తిగా నీటమునిగాయి. నగరం నడిబొడ్డున నాంపల్లిలోని సాయికృపా అపార్టుమెంట్‌ సెలార్‌లో మోకాలిలోతులో నీరు చేరింది.

కృష్ణానగర్‌ (యూసఫ్‌గూడ)లో దుకాణాల్లోకి వచ్చిన వరద


కాలనీల్లో ఇదీ పరిస్థితి

* బీఎన్‌రెడ్డినగర్‌ పరిధిలోని గాంధీనగర్‌లో కాలనీలో మోకాలిలోతులో నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరవడంతో కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు.

* బోడుప్పల్‌ శ్రీరాంరెడ్డినగర్‌ కాలనీ, శ్రీసాయిరాంనగర్‌కాలనీ పూర్తిగాజలదిగ్బంధంలో చిక్కుకుంది.

* యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌ సీబ్లాకులో నాలాలు పొంగి రహదారులపై మోకాలిలోతులో వరదనీరు పారింది. దుకాణాల్లోకి నీరు చేరి వస్తువులు పాడయ్యాయి.

* పాతబస్తీలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బహదూర్‌పురాలోని బస్తీల్లోకి భారీగా వరదనీరు చేరింది.

* ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్‌ కోలబస్తీలో నాలాలు పొంగి ఇళ్లలో రెండు, మూడు అడుగుల లోతులో నీరు చేరింది. వరదకుతోడు దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

* ఆర్కేపురంలో 60 ఇళ్లలో వరద నీరు చేరింది.

* జవహర్‌నగర్‌ పరిధిలోని కేఎన్‌ఆర్‌నగర్‌, కేసీఆర్‌నగర్‌, అంబేడ్కర్‌నగర్‌, పాతగబ్బిలాలపేట ప్రాంతాల్లో ఇళ్లను వరదనీరు ముంచెత్తింది. ఇళ్లలో వరదనీరు చేరడంతో అడుగు బయటపెట్టలేని పరిస్థితి.

టోలిచౌకి వద్ద వరదలో చిక్కుకున్న కారు

బహదూర్‌పురాలో కొట్టుకుపోతున్న ద్విచక్రవాహనాన్ని పట్టుకుంటున్న యువకులు

గచ్చిబౌలి జనార్ధనాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 1 నుంచి నాసర్‌స్కూల్‌కు వెళ్లే మార్గంలో ..

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నంబర్‌ 199 వద్ద పోటెత్తిన వరద

అత్తాపూర్‌ నీటిలో ఆగిన కారును నెడుతున్న యువకులుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని