సంక్షిప్త వార్తలు
eenadu telugu news
Published : 28/09/2021 04:03 IST

సంక్షిప్త వార్తలు

నష్టం జరగకుండా చూడండి

పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రేటర్‌కు భారీ వర్షాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ తదితరులతో ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరవాస కేంద్రాల్లో మొబైల్‌ అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజన సదుపాయం కల్పించాలన్నారు.


కూరగాయ పంటలకు తీవ్ర నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలతో నగర శివారుల్లో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేవెళ్ల, మెయినాబాద్‌, శంకర్‌పల్లి, శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, కందుకూరు, యాచారం మండలాల్లోని కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల నుంచి చేలల్లో వర్షపునీరు నిలిచి పంట కుళ్లిపోతుందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా టమాటా పంట బాగా దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సీజన్‌ ఆరంభం నుంచి భారీ వర్షాలు కురిశాయి. నారుమడి దశలోనే పంటలు చాలావరకు నాశనమయ్యాయి తాజాగా గులాబ్‌ తుపాను ప్రభావంతో శివారుల్లో పది వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.


జలమండలి ఆధ్వర్యంలో 16 ఈఆర్‌టీ బృందాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆదేశించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సోమవారం చర్చించారు. తరచూ మురుగు పొంగే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు నగర వ్యాప్తంగా 16 అత్యవసరబృందాలు(ఈఆర్‌టీ)ను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. ఒక్కో బృందంలో అయిదుగురు సభ్యులతో పాటు తగిన సామగ్రి ఉంటుందన్నారు. ఒక్కో ఎయిర్‌టెక్‌ యంత్రాన్ని కేటాయించినట్లు చెప్పారు. ఎక్కువ లోతు ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీగ్రిల్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.


ఉస్మాన్‌సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తివేత

ఈనాడు, హైదరాబాద్‌: విస్తారంగా కురుస్తున్న వానలకు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఉస్మాన్‌సాగర్‌లోకి 300 క్యూసెక్కులు వరద వస్తుండటంతో సోమవారం సాయంత్రానికి మరో రెండు గేట్లు ఎత్తారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా మూసీలోకి 480 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నారు. హిమాయత్‌సాగర్‌లోకి 350 క్యూసెక్కులు వరద వస్తుండగా.. ప్రస్తుతం ఒక గేటు ద్వారా అంతే వరదను మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత వరద పెరిగే సూచనలు ఉన్నాయి.


వణికిస్తోన్న శిథిల భవనాలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరవ్యాప్తంగా ఉన్న శిథిల భవనాలు వణికిస్తున్నాయి. కొన్నాళ్లుగా కురుస్తున్న వానలతో పాత నిర్మాణాలు ప్రమాదకరంగా మారాయి. దాదాపు సగం నిర్మాణాల్లో ప్రజలు నేటికీ నివసిస్తుండటం ఆందోళనకు తావిస్తోంది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా సుమారు 300 శిథిల భవనాలున్నా.. వాటిని గుర్తించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

ఆయా ప్రాంతాల్లో ఎక్కువ.. సికింద్రాబాద్‌, అబిడ్స్‌, కోఠి, పాతబస్తీ, ముషీరాబాద్‌, కవాడిగూడ, భోలక్‌పూర్‌, రెజిమెంటల్‌బజార్‌, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, సిద్దిఅంబర్‌బజార్‌, బడిచౌడీ తదితర ప్రాంతాల్లో శిథిల భవనాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు కేసులు, ఆర్థిక సమస్యలు, వ్యాపారాలు, ఇతరత్రా కారణాలతో యజమానులు లేదా కిరాయిదారులు వాటి కూల్చేవేతకు అంగీకరించట్లేదు. గతేడాది 127 భవనాలను కూల్చామని, 67 భవంతులకు యజమానులు మరమ్మతు చేసుకున్నారని ప్రణాళిక విభాగం తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని