బాలుడి ఆచూకీ లభ్యం
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

బాలుడి ఆచూకీ లభ్యం

కుటుంబీకులకు అప్పగించిన పోలీసులు

సంగారెడ్డి అర్బన్‌: నగరంలో అదృశ్యమైన మూగ బాలుడి ఆచూకీ సంగారెడ్డిలో లభ్యమైంది. ఈ మేరకు స్థానిక పోలీసులు నగరంలోని మియాపూర్‌ సీఐ శ్యామల వెంకటేశ్‌కు సమాచారం అందించారు. ఈ ఘటన మంగళవారం సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి గ్రామీణ ఎస్‌ఐ కె.సుభాష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హఫీజ్‌పేటకు చెందిన సంతోష్‌(13) ఈ నెల 26న మియాపూర్‌ సమీపంలో కల్వరి టెంపుల్‌కు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి చేరుకోకపోవడంతో బాలుడి కుటుంబసభ్యులు మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేశారు. వివరాల సేకరణలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. కల్వరి టెంపుల్‌ నుంచి ఆర్టీసీ బస్సులో సంగారెడ్డి వైపు వచ్చినట్లుగా కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీని ఆధారంగా పటాన్‌చెరు, సంగారెడ్డి పోలీసులకు వివరాలు తెలిపారు. ఈ క్రమంలో పోతిరెడ్డిపల్లి పరిధిలోని గొల్లగూడానికి బాలుడు చేరుకున్నాడు. స్థానికులతో కలిసి తెరాస నాయకుడు మల్లేశం వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా బాలుడికి మాటలు రాకపోవడంతో ఎలాంటి వివరాలు తెలియలేదు. దీంతో సెల్‌ఫోన్‌ ద్వారా ప్రసార మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ విషయం పట్టణ, గ్రామీణ పోలీసుల దృష్టికి రావడంతో సేకరించి మియాపూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బాలుడిని తీసుకెళ్లి అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని