వాగులో గల్లంతైన యువకుడి మృతి
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

వాగులో గల్లంతైన యువకుడి మృతి

ప్రభుత్వ నిర్లక్ష్యమేనని గ్రామస్థుల ఆందోళన

సంఘటన స్థలాన్ని పరిశీలించి డీఎస్పీతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే:  వికారాబాద్‌ మండలం పులుసుమామిడి వాగులో సోమవారం రాత్రి గల్లంతైన యువకుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన 7వ వార్డు సభ్యుడు షేక్‌ ఇసాక్‌పాషా(28)గా గుర్తించారు. బోరు మెకానిక్‌గా పనిచేస్తున్న ఇసాక్‌ సామగ్రి తెచ్చేందుకు సోమవారం హైదరాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా వాగుకు ఇరువైపులా వాహనదారులు నిలిచిపోయారు. కొద్దిసేపు ఆగిన అతను, ఎప్పుడూ తిరిగే దారే కదా అని, వాగు దాటే ప్రయత్నం చేయడంతో పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది వారించారు. అయినా వినకుండా ముందుకు వెళ్లడంతో వరద ఉద్ధృతికి బైక్‌తో పాటు కొట్టుకపోయాడు. అక్కడున్న వారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో రాత్రే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వర్షం, చీకటి ప్రతిబంధకంగా మారింది. గల్లంతైన వ్యక్తి ఎవరనేది తెలియలేదు. మంగళవారం ఉదయం ప్రవాహం తగ్గడంతో వాగులో కొద్దిదూరం కొట్టుకుపోయిన బైక్‌ కనిపించింది. నంబరు ఆధారంగా గల్లంతైన వ్యక్తి షేక్‌ఇసాక్‌పాషాగా గుర్తించారు. గ్రామస్థులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు. వాగు వెంట మూడు కిలోమీటర్లు అన్వేషించగా అత్తాపూర్‌ సమీపంలో చెట్ల పొదల్లో మృతదేహం కనిపించింది.

షేక్‌ఇసాక్‌పాషా

వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు, సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ లక్ష్మయ్య గ్రామస్థుల సాయంతో బయటికి తీసి, వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న వంతెనను  పూర్తి చేయాలని శాసనసభలో ప్రస్తావించిన రోజే ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసాక్‌కు భార్య, ఇద్దరు కవల పిల్లలున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రామస్థులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వంతెన పూర్తి కాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గ్రామానికి చెందిన భాజపా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారుల ఉదాసీనత కారణంగానే గుత్తేదారు  జాప్యం చేస్తున్నారని, ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైందని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


రోడ్డుపై బైఠాయించి గ్రామస్థుల ఆందోళన


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని