ఆనవాళ్లు చెరిపేసి.. చోరీ వాహనాల అమ్మకాలు
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

ఆనవాళ్లు చెరిపేసి.. చోరీ వాహనాల అమ్మకాలు

తుక్కు దుకాణంలో 12 లారీలు స్వాధీనం

పూడూరు, న్యూస్‌టుడే: ఈనెల 12న వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ కూడలిలో నిలిపి ఉంచిన జేసీబీ చోరీకి గురైన కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. గ్రామానికి చెందిన ఇబ్రహీం పగటిపూట పనులు చేసి రాత్రిల్లో ఎప్పటి మాదిరిగా పెట్రోల్‌ పంపులో జేసీబీని పార్కింగ్‌ చేసి తాళం వేసి ఇంటికి వెళ్లారు. పక్కనే ఇతర వాహనాలు సైతం ఉన్నాయి. జేసీబీకి జీపీఎస్‌ అనుసంధానం చేసి ఉంచారు. ట్యాంకులో డీజిల్‌ అయిపోయే ముందు యజమాని చరవాణికి ఓ సందేశం వస్తుంది. ఈ క్రమంలో ఈ నెల 12న అర్ధరాత్రి ఇబ్రహీం చరవాణికి సందేశం వచ్చింది. వెంటనే తేరుకుని వెళ్లి చూడగా జేసీబీ కనిపించలేదు. మరసటి రోజు చన్‌గోముల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శంషాబాద్‌లో ప్రత్యక్షం..: చోరీకి గురైన జేసీబీ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దానికున్న జీపీఎస్‌ ఆధారంగా సమీపంలోని పట్టణ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను అనుసరిస్తూ దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్‌ వైపు వెళ్లినట్లు గుర్తించి సైబరాబాద్‌ పోలీసుల సహాయంతో శంషాబాద్‌ వెళ్లారు. అక్కడ మెకానిక్‌ షాపు, పాత ఇనుప సామాన్ల గోదాంలో ఉన్నట్లు అనుమానించి దాడిచేశారు.

తీగలాగితే..: అక్కడ అక్రమాలు అనేకం బయట పడ్డాయి. చోరీ చేసి తెచ్చిన వాహనాల నుంచి భాగాలను విడదీసి గుర్తుపట్టకుండా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ గోదాం లోపల ఒకే రంగు కలిగిన 12 లారీలను గుర్తించారు. వాహనాల విడి భాగాలను తారుమారు చేసి ఆ లారీలకు ఒకే రంగు వేసినట్లు అనుమానించారు. వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అపహరణకు గురైన జేసీబీతో పాటు పత్రాలు సక్రమంగా లేకపోవడంతో ఆ 12 లారీలను స్వాధీనం చేసుకుని చన్‌గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. లారీలకు యజమాని టోలీచౌకి ప్రాంతానికి చెందిన దావూద్‌గా నిర్ధారించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీలకు సంబంధించిన పత్రాలు అసలువేనా? తయారు చేసినవా? అనేది నిర్ధారించేందుకు పత్రాలు జత చేసిన లేఖను రవాణాశాఖ అధికారుల పరిశీలనకు పంపారు. వారం రోజులు అయినా.. రవాణాశాఖ నుంచి సమాధానం రాలేదు. ఈ తరహా ఇంకా ఎన్ని చోరీలకు పాల్పడ్డారు? ఎక్కడి నుంచి ఎంతమంది భారీ వాహనాలు పోయాయి? అనేది తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా అక్రమాలు బయట పడనున్నాయి. కేసు దర్యాప్తు వేగవంతంగా సాగుతోందని సీఐ లక్ష్మిరెడ్డి వెళ్లడించారు. మన్నెగూడ నుంచి జేసీబీని తీసుకువెళ్లిన వ్యక్తి ఆచూకీ ఇంత వరకు లభించ లేదు. ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని