పోషకాల కంది...తాండూరుదేనండీ..!
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

పోషకాల కంది...తాండూరుదేనండీ..!

వినియోగదారులు కోరి మరీ కొనుగోలు
వరికి ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తే మేలు
న్యూస్‌టుడే, తాండూరు

న రాష్ట్రంలో వివిధ ప్రాంతాలో కందిని ఏక, మిశ్రమ పంటగా సాగుచేస్తున్నారు. అయితే రుచికరమైన కందిపప్పు గురించి ప్రస్తావన వస్తే జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో పండించే కంది గురించే ఎవరైనా చెబుతారు. ఈ పంటకు దేశ వ్యాప్తంగా పేరుంది. అన్ని రాష్ట్రాల్లో తాండూరు పప్పును మరీ కోరి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వాణిజ్య, సంప్రదాయేతర పంటలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఈ నేపథ్యంలో  దీని ప్రాధాన్యంపై ‘న్యూస్‌టుడే’ కథనం.
కందిగిన్నెగా పేరు
జిల్లాలో వర్షాధార సాగు భూమి 1.70 లక్షల ఎకరాలు. ఒక్క తాండూరు నియోజకవర్గంలోనే తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లోనే 50 వేల ఎకరాల్లో కంది పంట సాగవుతోంది. అందుకే దీనికి ‘కంది గిన్నె’గా పేరుంది. ఇక్కడి భూముల్లో పోషకాలు ఎక్కువ. దీంతో మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. నాణ్యమైన దిగుబడులు వస్తాయి. వ్యాపారులు కొనుగోలుకు పోటీ పడుతుంటారు. రైతులకు మద్దతుకు మించిన ధర లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కందులకు రూ.6,300 ప్రకటిస్తే వ్యాపారులు మాత్రం రూ.6,600 నుంచి రూ.6,700కు పైనే ధర చెల్లించి కొనుగోలు చేస్తారు.  
సాగు పెంచేందుకు చేయూత
పదేళ్ల కిందటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 60 వేల నుంచి 80 వేల ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేసే వారు. గిట్టుబాటు ధర రాకపోవడం తెగుళ్ల నివారణకు ఎక్కువ శ్రమ పడడం వంటి కారణాల వల్ల సాగును తగ్గిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఐదేళ్ల కిందటి నుంచి కందులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించింది. ఇదే సమయంలో కంది సాగును ప్రోత్సహించడంతో విస్తీర్ణ్ణాన్ని రైతులు పెంచుతున్నారు. దీనికి తోడు తెగుళ్లను తట్టుకునే వంగడాలను తాండూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు టీడీఆర్‌జీ-4( హనుమ) వంగడాన్ని కనుగొన్నారు. ఇదే విత్తనాన్ని అభివృద్ధి చేసి రైతులకు విక్రయించడంతో సాగు చేస్తున్నారు. అలాగే ఆర్‌జీటి-1( తాండూరు తెల్లకంది) వంగడం కూడా సాగు చేయడానికి అనుకూలంగా ఉంది. కంది పంట ముంపునకు గురైనా కోలుకునేందుకు అవకాశం ఉండడంతో రైతులు సాగుపై ఉత్సాహం చూపుతూ వస్తున్నారు.  
ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు
కందులను కొనుగోలు చేయడానికి కేంద్రప్రభుత్వం తాండూరులో ప్రత్యేకంగా ఏటేటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతులు ఇక్కడికే వచ్చి కందులను విక్రయిస్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను పప్పుగా మార్చి పేదలకు చౌకధరలకు విక్రయిస్తోంది.
తాండూరు కంది పప్పును వ్యాపారులు దిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, దేశ రాజధాని దిల్ల్లీలోని వినియోగదారులు తాండూరు కంది పప్పును మరీ అడిగి కొనుగోలు చేస్తారు.  

బోర్డు ఏర్పాటైతే...
తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తద్వారా రైతులకు బ్యాంకులు ప్రత్యేకంగా రుణాలు ఇస్తాయి. ప్రత్యేక పాలక మండలి ఏర్పాటవుతుంది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు.
వండితే ఘుమ ఘుమ వాసనే..
ఇంట్లో తాండూరు కంది పప్పును ఉడకబెడితే పరిసరాలన్నీ ఘుమ ఘుమ వాసనతో నిండిపోతాయి. సాంబారు చేసినా 24 గంటల వరకూ పాచి పోదు. కంది పచ్చడి మూడు నెలల వరకు పాడవదు. చింత పండును కలిపి తయారు చేసిన ముద్ద పప్పు వారం రోజుల వరకు రుచిగానే ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని