చెరువులను తలపించిన చేలు
eenadu telugu news
Published : 29/09/2021 01:40 IST

చెరువులను తలపించిన చేలు

4,920 ఎకరాల్లో పంటలు మునక

పత్తిపై తీవ్ర ప్రభావం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు చేరి పంటలు ఎర్రబారిపోతున్నాయి. దీంతో నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల  ప్రకారం పొలంలో నీరు చేరినంత మాత్రాన నష్టపోయినట్లు కాదంటున్నారు. ఇటీవల కురిసిన వానలకు ఒక్క ఎకరం కూడా నష్టం జరగలేదంటున్నారు. ఈ ఏడాది అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 8 మండలాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు గుర్తించారు. 3,418 మంది రైతులకు చెందిన 4,920 ఎకరాల పంట పొలాల్లో నీరు చేరడం, వరద పారినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో పత్తి 4,800 ఎకరాలు ఉండగా, వరి 120 ఎకరాలు. 20 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో 22 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 3,306 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో పొలాల్లో మరో మారు నీరు చేరడంతో మొక్క జొన్న, పత్తి పూర్తిగా ఎర్రబారిపోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటలకు బీమా చేస్తేనే మేలు..: గోపాల్‌రెడ్డి, రైతు, వికారాబాద్‌
ఎనిమిది ఎకరాల్లో పత్తి, కంది వేశా. ఈ నెల మొదట్లో కురిసిన వర్షాలకు నీరు నిలిచి చేను ఎర్రబారిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు మొదళ్లు కుళ్లిపోతున్నాయి. పొలం చదును చేసింది మొదలు విత్తులు, కూలీల ఖర్చులు పెరిగాయి. భారీ వర్షాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. రెండేళ్ల నుంచి పెట్టుబడులే తప్ప పైసా ఆదాయం కనిపించడం లేదు. సుమారు రూ.40 వేలు అప్పు కనిపిస్తోంది. ప్రభుత్వం రైతులకు బీమా చేసినట్లే పంటలకు బీమా చేయించాలి.
నీటిని తోడేయాలి: గోపాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి
ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు చేరింది. వర్షం ఆగిన వెంటనే నీటిని తోడేయాలి. అనంతరం మొక్కల మొదలు భాగంలో కాపర్‌ఆక్సీ క్లోరైడ్‌, స్పెక్టోమైసిన్‌ వేసుకుంటూ పోవాలి. యూరియా వాడటం మంచిది కాదు. ఇతర సలహాలకు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.


పెద్దేముల్‌: పెద్దేముల్‌ మండలంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నాగులపల్లి, ఇందూరు, ఆత్కూరు, గాజీపూరు, కందనెల్లి, మన్‌సాన్‌పల్లి వాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. గాజీపూరు వాగులోకి వరద చేరడంతో తాండూరు, సంగారెడ్డి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉద్ధృతి తగ్గడంతో కొనసాగాయి. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన కంది, పత్తి, చెరకు పంటలు నీటి మునిగాయి. కందనెల్లి, మన్‌సాన్‌పల్లి, దుగ్గాపూరు, జనగాం ప్రాంతాల్లో వరి నీట మునిగి పొలాలు చెరువులను తలపించాయి.


అప్రమత్తతతోనే రక్షణ: కలెక్టర్‌

ధారూర్‌, పెద్దేముల్‌, న్యూస్‌టుడే: భారీ వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని పాలనాధికారిణి నిఖిల ప్రజలకు సూచించారు. మంగళవారం మండల పరిధి దోర్నాల్‌, మంచన్‌పల్లి వాగులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వాగులు పొంగి పొర్లుతున్నాయని, అటువైపు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ఆమె వెంట అదనపు పాలనాధికారి చంద్రయ్య, తహసీల్దారు భీమయ్యగౌడ్‌ ఉన్నారు.
పెద్దేముల్‌ మండలంలోని మన్‌సాన్‌పల్లి వాగును మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్‌ నిఖిల పరిశీలించారు. వంతెన పనుల గురించి సంబంధిత శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక రహదారి తెగిపోవడంపై ఆరా తీశారు. ప్రజలు వాగుల వద్దకు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఎంపీడీవో లక్ష్మప్ప ఉన్నారు.


యాలాల, న్యూస్‌టుడే: జుంటిపల్లి అలుగు పారడడంతో పేర్కంపల్లి తాత్కాలిక రోడ్డు పూర్తిగా వరద ఉద్ధృతికి  కొట్టుకుపోయింది. ఏడాదిగా కొత్తగా వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఇరవై రోజులుగా కురుస్తున్న వానలకు ప్రతి సారి రోడ్డు కొట్టుకుపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


కొడంగల్‌, న్యూస్‌టుడే: కొడంగల్‌లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 16 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కొడంగల్‌ పెద్దచెరువు అలుగు పారింది. మండలంలోని అశమ్మకుంట వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.


ఇందూరులో జాగారం: పెద్దేముల్‌ మండలం ఇందూరులో వర్షం వచ్చిన ప్రతిసారి ఇళ్లల్లోకి వరద చేరుతోంది. ఇదే పరిస్థితి సోమవారం అర్ధరాత్రి మళ్లీ పునరావృతం అయింది. నీరంతా గ్రామం మధ్యలో నుంచి పారడంతో చాలా మంది రాత్రంతా జాగారం చేశారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో చీకట్లోనే గడిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని