అవే కాలనీలు.. అదే కన్నీరు!
eenadu telugu news
Updated : 29/09/2021 11:50 IST

అవే కాలనీలు.. అదే కన్నీరు!

ఏటా ముంపునకు గురవుతున్న ప్రాంతాలు

ప్రణాళికలకే పరిమితమవుతున్న యంత్రాంగం

మల్కాజిగిరి ఆనంద్‌ బాగ్‌లో వీధులు జలమయం

ఈనాడు, హైదరాబాద్‌: మహా నగరంలో ఏళ్లుగా ముంపు ప్రాంతాల సమస్యలు తీరట్లేదు. నిర్వహణ పనుల రూపంలో రూ.కోట్లలో ప్రజా ధనం ఆవిరవుతున్నా బాధిత ప్రాంతాల తిప్పలు కొనసాగుతున్నాయి. వర్షమొచ్చిన ప్రతిసారీ అవే కాలనీలు నీట మునుగుతున్నాయి.
మూడేళ్లయినా నిర్లక్ష్యం.. గతేడాది రాజేంద్రనగర్‌ పల్లె చెరువు వరదంతా గుర్రం చెరువుకు చేరుకోవడంతో.. తటాకానికి అధికారులు గండి కొట్టారు. నీరంతా అల్‌జుబైల్‌ కాలనీ, గాజిమిల్లత్‌ కాలనీ, ఇమ్రాకాలనీ, ఉప్పుగూడ, శివాజీనగర్‌, క్రాంతినగర్‌, అరుంధతి కాలనీ, సైఫాబాద్‌, ఉస్మాన్‌నగర్‌, హఫీజ్‌బాబానగర్‌ ప్రాంతాలను ముంచెత్తింది. స్థానికంగా నాలా ఆక్రమణలు తొలగిస్తే ఈ సమస్య ఉత్పన్నంకాదు. అధికారులు రాజకీయ కారణాలతో ఆ పనులు చేపట్టడం లేదు.
పరిష్కరించలేక చెరువుకు ఉరి.. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌ వరద నీరు శాతన్‌ చెరువుకు చేరుతుంది. దీని వెనుక వైపు నదీం కాలనీ, నీరజ కాలనీలు ఏర్పడ్డాయి. చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలు వచ్చాయి. దీంతో చిన్నపాటి వర్షానికే నదీం కాలనీ, దాని చుట్టు పక్కల ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. 20ఏళ్లుగా ఇదే దైన్యం.
ముంచుతున్న మురుగు లైన్లు.. చిన్నపాటి వర్షానికే బేగంపేట బ్రాహ్మణవాడి, ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, మయూరిమార్గ్‌ ప్రాంతాలు నీట మునుగుతాయి. అక్కడున్న మురుగునీటి పైపులైను వ్యవస్థే.. దిగువకు వెళ్లే వరదను కాలనీల్లోకి మళ్లిస్తోంది.
గొలుసు కట్టు వ్యవస్థకు గండి.. మీర్‌పేట, బాలాపూర్‌ ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులతో అనుసంధానమైన సరూర్‌నగర్‌ చెరువు గతేడాది ఉగ్రరూపం దాల్చింది. కోదండరామ్‌ నగర్‌, పీఅండ్‌టీ కాలనీ, శారదానగర్‌ రెండు నెలలు ముంపులో ఉన్నాయి. అక్కడి నాలాలను ఏడాదికల్లా విస్తరిస్తామని రూ. 400కోట్లతో జోనల్‌ అధికారులు ప్రణాళిక రూపొందించినా పనులు ప్రారంభం కాలేదు. అదే జోన్‌ పరిధిలోని బండ్లగూడ, ఇతరత్రా తటాకాలకు అధికారులు గండి కొట్టి కూర్చున్నారు.
ఏటా మునుగుతున్న ఉప్పల్‌.. నాచారం పెద్ద చెరువు నుంచి ఉప్పల్‌ నల్లచెరువు మీదుగా మూసీకి చేరే వరద నీరు.. నాలా ఆక్రమణలతో చాలా కాలనీలను ముంచుతోంది. ఏళ్లుగా చిలకానగర్‌, చుట్టుపక్కల ప్రాంతాలు మునుగుతున్నా ఆక్రమణలను తొలగించడం లేదు. రామంతాపూర్‌ పెద్ద చెరువు విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయా కాలనీల్లో జీహెచ్‌ఎంసీ పడవలను సిద్ధంగా ఉంచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని