దుబాయ్‌ పంపేందుకు వెళ్లి..
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

దుబాయ్‌ పంపేందుకు వెళ్లి..

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో ఘటన

శామీర్‌పేట, న్యూస్‌టుడే: తండ్రిని విదేశానికి పంపించేందుకు వెళ్లి సోదరులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట రాజీవ్‌ రహదారిపై మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన శేరి సుదర్శన్‌(35) తండ్రి అనంతి దుబాయ్‌లో పనిచేసేవారు. తిరిగి వెళ్లేందుకు సోమవారం అర్ధరాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి కుమారుడితో పాటు అన్న కొడుకు శేరి రాజేందర్‌(35), బంధువు వంశీ(22)తో కలిసి నలుగురు కారులో బయలు దేరారు. మంగళవారం ఉదయం విమానాశ్రయానికి చేరుకున్నారు. కరోనా పరీక్ష చేయాల్సి ఉండడంతో ఆలస్యమవుతుందని.. తిరిగి వెళ్లాలని అనంతి కుమారులకు సూచించారు. వారు వీడ్కోలు చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి-మజీద్‌పూర్‌ మధ్య (ట్రక్కు బే)లో కంటైనర్‌ నిలిపి ఉంది. కారు డ్రైవర్‌ రాజేందర్‌ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపుతప్పి కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వాహనం నుంచి అతికష్టం మీద మృతదేహాలను బయలకు తీశారు. సుదర్శన్‌ స్థంభంపల్లి విద్యుత్తు ఉప కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని గ్రామస్థులు చెప్పారు. ఎస్సై గణేశ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి తిరుగు పయనం... రాజీవ్‌ రహదారిపై కారు ప్రమాదంలో అనంతి కుమారుడు, అన్న కొడుకు మృతితో ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుదర్శన్‌ వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతోంది. సంతానం లేదు. చెల్లెలి వివాహం గత నెల 12న జరిపించారు. రాజేందర్‌ భార్య నిండు గర్భిణి. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని