హింసించాడు.. ఆయువు తీశాడు
eenadu telugu news
Updated : 29/09/2021 13:53 IST

హింసించాడు.. ఆయువు తీశాడు

భార్య హత్య కేసులో నిందితుడి అరెస్టు

గంగాధర్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: పిచ్చి ప్రవర్తన, వేధింపులతో పెళ్లై ఏడాది గడవకముందే భార్యకు నరకం చూపాడు. పోలీసు జైలుకు పంపినా.. పెద్దలు రాజీ కుదిర్చినా పద్ధతి మార్చుకోలేదు. చివరకు తన మామ చనిపోయాడని తెలిసి పుట్టింటి నుంచి వచ్చిన భార్యను గొంతు నులిమి కడతేర్చాడు. సనత్‌నగర్‌ ఠాణా పరిధిలోని మూసాపేట జేపీనగర్‌లో నవ వధువు మానస హత్యోదంతంలో పోలీసులు అమె భర్త గంగాధర్‌ను మంగళవారం అరెస్టు చేశారు. వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ముత్తుయాదవ్‌ మీడియాకు వివరించారు. నిజామాబాద్‌ జిల్లా దర్పల్లికి చెందిన మానస(24)తో జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్‌(32)కు గతేడాది నవంబరు 20న వివాహమైంది. విచిత్ర ప్రవర్తనతో తనను వేధిస్తుండటంతో ఆమె జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కౌన్సిలింగ్‌ ఇచ్చినా గంగాధర్‌ పద్ధతి మార్చుకోలేదు. మరోసారి పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చిన తరవాత పెద్దలు రాజీ కుదిర్చి దంపతులను కలిపారు. జగద్గిరిగుట్ట నుంచి మూసాపేట జేపీ నగర్‌కు వచ్చి కాపురం పెట్టారు. గంగాధర్‌ వేధింపులు ఆపకపోవడంతో మూడు నెలల కిందట ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పది రోజుల కిందట గంగాధర్‌ తండ్రి మరణించడంతో మానస జగద్గిరిగుట్టలోని భర్త ఇంటికి వచ్చింది.

నిద్రలో ఉండగా..  మానసను ఆదివారం జగద్గిరిగుట్ట నుంచి మూసాపేటలో ఉంటున్న ఇంటికి గంగాధర్‌ తీసుకొచ్చాడు. సాయంత్రం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. తాను గర్భస్రావం చేయించుకున్నానని ఆమె చెప్పడం, అంతకుముందు ఒకసారి జైలుకెళ్లడం గంగాధర్‌ మనసులో పెట్టుకున్నాడు. ఆమె నిద్రలో ఉండగానే గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని