ఖాకీ ‘ఝలక్‌’...
eenadu telugu news
Published : 29/09/2021 03:55 IST

ఖాకీ ‘ఝలక్‌’...

పోలీసులు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం
నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా ఫిర్యాదుదారుడు కాళ్లరిగేలా ఠాణాల చుట్టూ చక్కర్లు కొడితే తప్ప పోలీసులు కేసు నమోదు చేయరు. కానీ.. ఇదే అనుభవం పోలీసులకూ ఎదురైంది. ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల తర్వాత గానీ కేసు నమోదు చేయకపోవడం పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఈ ఘటన సైబరాబాద్‌ పరిధిలో తాజాగా చోటు చేసుకుంది.
ఈ నెల 22న రాత్రి 10 గంటల సమయంలో గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయినట్లు మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సిబ్బందికి అక్కడికి చేరుకున్నారు. అక్కడ సినిమా షూటింగ్‌ జరుగుతున్నందునే ట్రాఫిక్‌ జాం అయినట్లు గుర్తించారు. అనుమతుల్లేకుండా షూటింగ్‌ చేస్తున్నట్లు నిర్ధారించారు. రాయదుర్గం ఠాణాలో నిర్వాహకులపై ఫిర్యాదు చేసినట్లు మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి పోలీస్‌ సిబ్బంది ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేస్తుంటారు. ఇక్కడ మాత్రం అంతా భిన్నంగా జరిగింది. నాలుగు రోజుల తర్వాత అంటే ఈ నెల 26న ఎఫ్‌ఐఆర్‌ (నంబర్‌:583/2021) ఫైల్‌ చేశారు. ఫిర్యాదుదారుల వాదన ఒకలా ఉంటే.. రాయదుర్గం పోలీసులేమో అదే రోజు ఉదయం 9.30 గంటలకు ఫిర్యాదు అందినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పైగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసినట్లు పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరి వాదన నిజం..? ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేశారా? మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది విచారణలో తేలుతుందని సంబంధిత ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని