భారీ వర్షం... పొంగిన వాగులు, వంకలు
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

భారీ వర్షం... పొంగిన వాగులు, వంకలు

అలుగు పారుతున్న శివసాగర్‌

తాండూరు, న్యూస్‌టుడే: జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వొంకలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలకు పాట్లు తప్పలేదు. తాండూరు, పెద్దేముల్‌ మండలాల్లో గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి వాగుల్లో వరద నీరు వేగంగా వచ్చి చేరింది. గాజీపూరు, బుద్దారం, నాగులపల్లి, ఇందూరు, మన్‌సాన్‌పల్లి, కందనెల్లి, జుంటివాగు, బెల్కటూరు వాగులు వరదతో పొంగి ప్రవహించాయి. జిల్లాలో అతిపెద్దదైన కోట్‌పల్లి జలాశయంలోకి ప్రస్తుతం కొనసాగుతున్న వరదకు తాజాగా కురిసిన వర్షానికి మరింత వరద తోడైంది. దీంతో ఎక్కువైన నీరు అలుగు నుంచి దిగువకు ప్రవహించింది. ఇదే నీరు కాగ్నానదిలోకి వెళ్లడంతో అక్కడ వరద ప్రవాహం పెరిగింది. కాకరవేణి నది నుంచి యాలాల మండలం కేంద్రం సమీపంలోని శివసాగర్‌ జలాశయంలోకి వరద వస్తోంది. ఎక్కువైన నీరు విశ్వనాథ్‌పూరు, గోవిందరావుపేట, సంగెం కుర్దు గ్రామాల సమీపం నుంచి కాగ్నానదిలోకి వెళుతోంది. తాండూరు పట్టణంలో చిలుక వాగులోనూ ప్రవాహం ఎక్కువైంది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సిద్దులూరు వాగు

రహదారులు జలమయం

తాండూరు పట్టణంలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరద కాలువల్లోంచి ప్రవహించే పరిస్థితి లేక పోవడంతో నేరుగా రహదారులపైకి వచ్చి మడుగు కట్టింది. ఈ పరిణామంతో వచ్చి పోయే వాహనదారులు, కాలినడకన వెళ్లే వారు అవస్థలు పడ్డారు. పట్టణంలోని సాయిపూరు, భవానీ నగర్‌, యశోదనగర్‌, శాంతినగర్‌, గ్రీన్‌సిటీ, పాత తాండూరు, ఎన్టీఆర్‌నగర్‌ కాలనీల్లోని రహదారులపై నీరు నిలిచింది. పట్టణంలో జిల్లా ఆసుపత్రి మీదుగా నేతాజీ చౌక్‌ వరకు వెళ్లే రహదారి నీటి మడుగును తలపించింది. తులసీనగర్‌, ఆదర్శనగర్‌లో కాలువల్లోని మురుగు బయటికి రావడంతో తలెత్తిన దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి వికారాబాద్‌కు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న శివసాగర్‌ చెరువు అలుగు పారింది. ఈ సంవత్సరం జూలైలోనే చెరువు నీటితో నిండి అలుగు పారింది. మరోసారి ఇప్పుడు అలా జరిగింది. పట్టణ ప్రజలు చెరువు వద్దకు వచ్చి అలుగు పారుతున్న దృశ్యాన్ని తమ చరవాణిలో బందించారు.

వికారాబాద్‌ గ్రామీణ: భారీ వర్షాలకు మండల పరిధిలోని సిద్దులూరు, కొటాలగూడ, పులుసుమామిడి, నారాయణ్‌పూర్‌, పెండ్లిమడుగు, బురాన్‌పల్లి, మద్గుల్‌చిట్టంపల్లి, ధన్నారం గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని