ఉద్యాన వృద్ధికి ఊతం
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

ఉద్యాన వృద్ధికి ఊతం

రూ.100 కోట్ల కేటాయింపు
‘ఈనాడు’ ముఖాముఖిలో జిల్లా అధికారి చక్రపాణి
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌
చక్రపాణి

జిల్లాలో ఉద్యాన పంటలకు మంచి రోజులు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా..ఒక ఉత్పత్తి (వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌)’ పథకంలో భాగంగా తెలంగాణలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలను ఎంపిక చేసింది. కూరగాయలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించనుంది. దీనికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు కేటాయించింది. రెండు జిల్లాలకు చెరో రూ.50 కోట్ల చొప్పున వచ్చే మూడేళ్ల పాటు అందిస్తుంది. తద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యాన సాగు విస్తీర్ణం రెండింతలు చేయాలన్నది తమ ముందున్న లక్ష్యమని జిల్లా ఉద్యాన శాఖాధికారి చక్రపాణి అన్నారు. పంటల సాగు, నిల్వ చేయడానికి గిడ్డంగులు, మార్కెటింగ్‌ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పలు అంశాలు తెలిపారు. వివరాలు..

ప్ర: మన జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ప్రస్తుతం ఎంత ఉంది. భవిష్యత్తు లక్ష్యాలు ఎలా ఉంటాయి.

జ: ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లాలో 28 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. టమాటా, క్యారెట్‌, బీరకాయలు, వంగ, బెండ, చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, కాకర, కొత్తిమీర, పుదీన, మామిడి, బొప్పాయి తోటలు ఉన్నాయి. కనీసం 50 వేల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వరికి ప్రత్యామ్నాయ కూరగాయల సాగు పెంచాలని ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. అవసరమైన వారికి రైతు వేదికల్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వికారాబాద్‌, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌, మర్పల్లి, పూడూరు, ధారూర్‌, పెద్దేముల్‌ మండలాల్లో కూరగాయల సాగుకు జరుగుతోంది. ఆయా ప్రాంతాలపై మరింత దృస్టిసారిస్తాం.

పందిరి యనిట్లను పరిశీలిస్తున్న అధికారులు

ప్ర: రైతులకు ఇచ్చేరాయితీలు ఏమైనా ఉన్నాయా...

జ: సమీకృత ఉద్యాన అభివృద్ధి సంస్థ (ఎంఐడీహెచ్‌), జాతీయ ఉద్యాన పంటల బోర్డు (ఎన్‌హెచ్‌బి), ఆర్‌కేవీవైల కింద ఈ పథకం అమలుకు రైతులకు 90 శాతం రాయితీపై విత్తనాలు, నారు అందిస్తాం. పందిరి సాగు యూనిట్లు, పంట నిల్వలకు గిడ్డంగులు, గ్రేడింగ్‌ యూనిట్లు, ప్యాక్‌ హౌస్‌, మల్చింగ్‌ షీట్‌, ఇతర రకాలకు యూనిట్‌ విలువను బట్టి రూ.50 వేల నుంచి రూ.3 లక్షలకుపైగా రాయితీ వర్తిస్తుంది. రైతు ఏ పంట వేయాలనుకుంటే ఆ నారు జీడిమెట్ల నుంచి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముందస్తుగా సమాచారం అందిస్తే సమయానికి అందిస్తాం.


ప్రశ్న: ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి’ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి.

జవాబు: కేంద్ర ప్రభుత్వం మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోంది. అందుకు అనువైన నేలలు, మార్కెటింగ్‌ సదుపాయాలు ఉన్న జిల్లాలను ఎంపిక చేసి, రైతులను ప్రోత్సహించవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలను సాగు చేయాలని సూచిస్తోంది. ఇందులో భాగంగానే వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు రూ.100 కోట్ల నిధులు సమకూర్చనుంది.


ప్ర: రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలనే ఎంపిక చేయడానికి కారణాలేమైనా ఉన్నాయా..

జ: హైదరాబాద్‌ నగరంలో 1.10 కోట్ల మంది జనాభా ఉన్నారు. అక్కడి ప్రజలకు నిత్యం వేల టన్నుల కూరగాయలు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం స్థానికంగా పండిస్తున్న పంటలకు అదనంగా ఉల్లి, బంగాళాదుంప, టమాటా, పొట్లకాయ, అరటి, బొప్పాయి, ఇతర కూరగాయలు, పండ్లను మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 14 దేశాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్నారు. దీంతో స్థానికంగా కూరగాయలు, పండ్ల తోటలకు డిమాండ్‌ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేసినట్లు అంచనా.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని