ఎస్సీలకు ప్రత్యేక సాధికారతా పథకం
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

ఎస్సీలకు ప్రత్యేక సాధికారతా పథకం

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఎస్సీ శాసన సభా నియోజక వర్గాల్లో ప్రత్యేక సాధికారతా పథకాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్నామని ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా కార్యనిర్వహణాధికారి బాబుమోజెస్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కార్యాచరణ పథకం 2020-2021 కింద వికారాబాద్‌, చేవెళ్ల నియోజక వర్గాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రెండు పాడి పశువుల కొనుగోలుకు రూ.2 లక్షలు రుణం అందజేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం కార్పొరేషన్‌ రూ.1.40 లక్షలు (70 శాతం) రాయితీని అందజేస్తుందని, మిగిలిన 30 శాతం (రూ.60 వేలు) సంబంధిత ఏరియా బ్యాంక్‌ నుంచి రుణంగా పొందాలని సూచించారు. జిల్లాలో విజయ డెయిరీ వారికి పాల సేకరణకు అనువుగా ఉన్న గ్రామాలలో మొదటి విడతలో రుణం మంజూరు చేస్తారని తెలిపారు. మిగిలిన గ్రామాలను దశల వారీగా ఎంపిక చేస్తారన్నారు. వికారాబాద్‌ నియోజక వర్గమే కాకుండా నవాబ్‌పేట మండలంలోని అన్ని గ్రామాలు విజయ డెయిరీ వారు పాల సేకరణకు అనువుగా ఉందని గుర్తించారని ఆయన తెలిపారు. అర ఎకరా ఆపై భూమి కలిగిన ఎస్సీ రైతులు ఈనెల 23 తేదీ శనివారంలోగా దరఖాస్తులను సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయంలో, లేదా పురపాలక కమిషనర్‌కు ఇవ్వాలని సూచించారు. దరఖాస్తుతో పాటు కులం, ఆదాయం, రేషన్‌ కార్డు, భూమి పుస్తకానికి సంబంధించిన జిరాక్స్‌ ప్రతులను జతపరచాలని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని