యువకుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
eenadu telugu news
Published : 17/10/2021 03:29 IST

యువకుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): తాండూరులో అర్ధరాత్రి యువకుల మధ్య జరగిన ఘర్షణలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎస్‌ఐ సతీష్‌ కుమార్‌ తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఇందిరానగర్‌ ప్రాంతంలో దసరా సందర్భంగా మండపం ఏర్పాటు చేసి స్థానికులు అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మిర్యాణం నవీన్‌, బాతుల శ్రీధర్‌ అనే యువకులు మండపం వద్దకు వచ్చి అక్కడే ఉన్న పాండు అనే వ్యక్తితో గొడవకు దిగారు. అతన్ని కొట్టారు. ఎందుకిలా చేస్తున్నారని పక్కనే ఉన్న మరో యువకుడు నరేందర్‌ వచ్చి వారిని నిలువరించటానికి ప్రయత్నించాడు. ‘నీకెందుకురా.. మధ్యలో వస్తావంటూ’ చంపేస్తామని బెదిరించారు. అనంతరం నవీన్‌, శ్రీధర్‌లు వెళ్లి పోయి కొద్ది సేపటి తర్వాత మరికొందరిని వెటబెట్టుకుని కొబ్బరి బోండాలు నరికే కత్తులు, కర్రలు తీసుకుని వచ్చారు. వాటితో నరేందర్‌, అతని పక్కనే ఉన్న మరో స్థానికుడు రవిచందర్‌పై దాడి చేశారు. దీంతో వారి తలలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి అంతటితో ఆగక ఆ ప్రాంతంలోని ఇళ్ల తలుపులు, ఇళ్ల బయట ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. గాయపడిన వారిని అక్కడే ఉన్న మిగతా యువకులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి ఎస్‌ఐలు సిబ్బందితో వెంటనే ఆ స్థలానికి వచ్చి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు. దాడికి పాల్పడిన నవీన్‌, ఇతని స్నేహితుడు మహ్మద్‌ రఫీలను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు వారిలో బాతుల శ్రీధర్‌తోపాటు అయిదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


మల్లెమోనిగూడలో ఉద్రిక్తత

పరిగి, న్యూస్‌టుడే: దసరా ఉత్సవాల సందర్భంగా పరిగి పురపాలక సంఘం పరిధిలోని మల్లెమోనిగూడలో శుక్రవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పండగ సందర్భంగా ఓ ప్రార్థనా మందిరం నుంచి ఓ వర్గం వెళ్తున్న క్రమంలో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మరో వర్గం వారు పట్టణంలో విద్యుత్తును నిలిపి వేశారు. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ జి.శ్రీనివాస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. శనివారం ఓ వర్గం వారు పరిగి పట్టణంలోని జాతీయ రహదారిపై బస్టాండు వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి వారిని తన ఇంటికి ఆహ్వానించి రాత్రి జరిగిన పరిస్థితులును అడిగి తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై పోలీసు కేసు నమోదు చేయిస్తామని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని