చలోషహర్‌..చూసొద్దాం నయా చార్మినార్‌!
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

చలోషహర్‌..చూసొద్దాం నయా చార్మినార్‌!

నేడే ‘ఏక్‌ శామ్‌.. చార్మినార్‌ కే నామ్‌’ మొదలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, చార్మినార్‌, న్యూస్‌టుడే: ప్రపంచమంతటా ఎక్కడికెళ్లినా హైదరాబాద్‌ పేరెత్తగానే బిర్యానీ ఘుమఘుమలు ముక్కుపుటాల్ని తాకితే.. చార్మినార్‌ చిత్రం కళ్ల ముందు మెదులుతుంది. నవాబుల నగర వైభవానికి ప్రతీకగా నిలుస్తోన్న ఈ చారిత్రక కట్టడం మొన్నే 430 ఏళ్ల పడిలోకి అడుగిడింది. ఆ మట్టి గాజుల చప్పుళ్లు, అత్తరు సువాసనలు, నోరూరించే రుచులు.. ఇవన్నీ హైదరాబాద్‌ తెలిసిన అందరికీ కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే.. అసలే కనిపించని వాహనాలు, వినిపించని రణగొణ ధ్వనులు, వీనుల విందుగా దక్కన్‌ ముషాయిరాలు, కొత్త కాంతుల నడుమ లాడ్‌ బజార్‌ గల్లీలు, ఇంకెన్నో అద్భుతాలు ఒకేచోట కనిపిస్తే..? ఈరోజు అదే జరగబోతోంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12దాకా చార్మినార్‌ వీధులన్నీ నగరవాసుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రతివారం నగరవాసుల వారాంతపు విహారానికి ట్యాంక్‌బండ్‌ చిరునామాగా మారగా.. ఇప్పడు 15 రోజులకోసారి చార్మినార్‌ అదనపు సంబురం ఇవ్వనుంది.

3 గంటల నుంచే దారులు బంద్‌..

మధ్యాహ్నం 3 గంటల నుంచే వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. అఫ్జల్‌గంజ్‌, మదీనా నుంచి వచ్చే వాహనాలను గుల్జార్‌హౌజ్‌ నుంచి కాలీకమాన్‌వైపు, ఫలక్‌నుమా నుంచి వచ్చేవి పాంచ్‌మొహలా మీదుగా బీబీబజార్‌ వైపు, మొఘల్‌పురా నుంచి వచ్చేవి సర్దార్‌మహల్‌ మీదుగా ఈటెబార్‌చౌక్‌ వైపు, మూసాబౌలి నుంచి వచ్చేవి కిల్వత్‌ రోడ్డు వైపునకు మళ్లించనున్నారు. ఈవైపు నుంచి ప్రయాణించే ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని, పోలీస్‌ సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు.

మేమెక్కడికెళ్లాలి..?

చార్మినార్‌ను నమ్ముకొని ఏళ్లుగా చిరు వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. ఈ కార్యక్రమం కోసం శనివారం అర్ధరాత్రి నుంచే దాదాపు 2 వేల మందిని వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో తమకూ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


పార్కింగ్‌ ఇక్కడ..

అఫ్జల్‌గంజ్‌, నయాపూల్‌, మదీనా వైపు నుంచి వచ్చే వారికి..: సర్దార్‌ మహల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయం లోపల, కోట్ల అలిజా ముఫీద్‌ ఉల్‌ అనాం బాయ్స్‌ హైస్కూల్‌, ఎస్‌వైజే కాంప్లెక్స్‌, ఏయూ ఆసుపత్రి, చార్మినార్‌ బస్టాండ్‌ ప్రవేశద్వారం.

ముర్గీచౌక్‌, శాలిబండ నుంచి వచ్చేవారికి..: మోతిగల్లీ పెన్షన్‌ ఆఫీస్‌, ఉర్దూ మస్కాన్‌ ఆడిటోరియం, కిల్వత్‌ గ్రౌండ్‌, చార్మినార్‌ బస్టాండ్‌ ప్రవేశద్వారం.

మదీనా, పురానాపూల్‌, గోషామహల్‌ నుంచి వచ్చేవారికి..: కులీకుత్‌బ్‌షా స్టేడియం, సిటీ కాలేజీ, ఎంజే బ్రిడ్జి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని