వరుణా.. లేదా కరుణ
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

వరుణా.. లేదా కరుణ

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
చింతలకుంట వద్ద జాతీయ రహదారిపై వరదనీరు

వర్షం పేరు చెబితేనే రాజధానిలోని వందల కాలనీలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. కొన్ని నెలల కిందటి వరకు రోజంతా వర్షం కురిసినా అయిదారు సెంటీమీటర్ల వర్షమే పడేది. రెండు నెలలుగా చూస్తే గంటలోనే పది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలకు అనేక కాలనీలు తట్టుకోలేకపోతున్నాయి. ఏడాది కాలంగా దాదాపు 50 కాలనీలు ముంపునీటిలో ఉన్నా హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడంలేదు. శనివారం వరుణుడి దెబ్బకు మరోసారి ముంపు తప్పలేదు.

రామంతాపూర్‌ నల్లపోచమ్మ ఆలయంలోకి చేరిన వరద

రాజధానిని వరద గండం నుంచి గట్టెక్కించడానికి నాలాల వ్యవస్థను పటిష్ఠం చేయడంతోపాటు కొత్తగా నాలాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళికను రూపొందించారు. కానీ ఆర్థిక శాఖ మాత్రం నిధులను విడుదల చేయడంలేదు. భారీ మొత్తం వెచ్చించే పరిస్థితి లేనందున తొలుత నాలాల ఆక్రమణలు తొలగిస్తే వర్షం నీరు ముందుకు వెళుతుందని తద్వారా కొంతవరకు ముంపు సమస్య తీరుతుందని అధికారులే చెబుతున్నారు. తక్షణం దీనిపై చర్యలు తీసుకోమని సర్కార్‌ ఏడాది కిందట ఆదేశించినా ఈ పనుల్లో పెద్దగా పురోగతిలేదు. మరోవైపు శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అమీర్‌పేట నుంచి పంజాగుట్ట మీదుగా ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, మొజంజాహీమార్కెట్‌, చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, మూసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వరకూ ట్రాఫిక్‌జాంలు ఏర్పడ్డాయి.

ఖైరతాబాద్‌ మెట్రోస్టేషన్‌ వద్ధ.


రేపు ఉదయం వరకు..

ఈనాడు, హైదరాబాద్‌: అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉదయం వరకు గ్రేటర్‌ పరిధిలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. పసుపు పచ్చ హెచ్చరికను జారీ చేసింది. ఆదివారం ఉదయం సోమవారం ఉదయం వరకు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షం పడవచ్చని తెలిపింది. జూన్‌ నుంచి ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 61 రోజులు వానలు పడ్డాయి.


నీట మునిగాయి..

* ఖైరతాబాద్‌ మెట్రో కేంద్రం కింద మోకాళ్లలోతు నీళ్లు నిలిచాయి. రైల్వే గేటు వైపు రోడ్డు పూర్తిగా మునిగిపోయి దుకాణాల్లోకి నీరు చేరింది. అంబర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లో కాలనీల్లోకి భారీగా వరద చేరింది.

* రామంతాపూర్‌లో తవ్వి వదిలేసిన గుంతలో ఓ ద్విచక్రవాహనదారుడు అందులో పడిపోయారు. స్థానికుల సాయంతో బయటపడ్డాడు.


గేట్లు ఎత్తివేత..

బండ్లగూడజాగీర్‌, నార్సింగి, న్యూస్‌టుడే: భారీ వర్షంతో హిమాయత్‌సాగర్‌, గండిపేట(ఉస్మాన్‌సాగర్‌)లకు వరద పెరిగింది. దీంతో ఒక్కో జలాశయం నుంచి నాలుగు గేట్ల చొప్పున రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు.


ఒక్క కాల్‌ దూరంలోనే ఉన్నాం..

- మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

నగరంలో భారీగా కురుస్తున్న వానలకు జనం అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి కోరారు. క్షేత్రస్థాయిలో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలున్నాయని.. ఏ ఇబ్బందులొచ్చినా జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ 040-21111111 నెంబరును సంప్రదించాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని