పింఛన్లు ఇప్పిస్తామంటూ వసూళ్లు!
eenadu telugu news
Published : 17/10/2021 04:14 IST

పింఛన్లు ఇప్పిస్తామంటూ వసూళ్లు!

నగరంలో దళారుల దందా షురూ
ఈనాడు, హైదరాబాద్‌

గరంలో మళ్లీ దళారుల దందా మొదలైంది. వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయసును ప్రభుత్వం 57 ఏళ్లకు తగ్గించింది. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ(ఎస్‌ఈఆర్‌పీ) ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇదే అవకాశంగా దళారులు వసూళ్లకు దిగారు. గతంలో పింఛను కోసం దరఖాస్తు చేసిన వారితో పాటు అర్హులను గుర్తించి బేరసారాలు సాగిస్తున్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో నలుగురు ముఠా నాలుగైదేళ్లుగా సంక్షేమ పథకాలు ఇప్పిస్తామంటూ ఆశావహుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దళారుల దందాపై కలెక్టర్‌ ఎల్‌.శర్మన్‌ చౌహాన్‌ తహసీల్దార్లను అప్రమత్తం చేశారు. ఫిర్యాదులొస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ఎప్పుడూ ఇదే తంతు

నగరంలో సుమారు 1.60 లక్షల మంది ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. సగం మంది వృద్ధులు ఉంటారని అంచనా. కొత్త పింఛన్ల మంజూరులో ఆలస్యం కావడంతో ప్రస్తుతం 6000-7000 వరకు దరఖాస్తులు ఆయా కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. వయో పరిమితి 57 ఏళ్లకు తగ్గించిన తరువాత అర్జీలు స్వీకరించారు. మిగిలిన అర్హులకూ అవకాశం కల్పించేందుకు ఈనెల 11 నుంచి 30వ తేదీ వరకు గడువు పొడగించారు. వెంటనే రంగంలోకి దిగిన దళారులు కాలనీల్లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో త్వరితగతిన అర్జీలు పరిశీలించేలా చూస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.1000-1500 వరకు వసూలు చేస్తున్నట్టు ఒక తహసీల్దార్‌ తెలిపారు. కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు, స్థానిక నేతలు చేతులు కలపడంతో దండుకోవడం సులభమైంది. తహసీల్దార్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయాల్లో మకాం వేస్తూ దరఖాస్తుదారులను బెదిరించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, తిరుమలగిరి, ఆసిఫ్‌నగర్‌, గోల్కొండ, నాంపల్లి, బండ్లగూడ, బహదూర్‌పుర ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు బయటపడుతున్నాయి.

వీధికో ముఠా

దళారీ అవతారం పైసా ఖర్ఛు. కాయకష్టం చేయకుండా అడ్డగోలుగా సంపాదించే ఏకైక మార్గం. మహా నగరంలో రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ ఎంతో మంది మాయగాళ్లు మోసం చేస్తుంటారు. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ల గడువు పెంచటంతో వీధికో ముఠా తయారైందని అధికారులు చెబుతున్నారు. ఎస్సార్‌నగర్‌కు చెందిన ఓ ముఠా.. పింఛన్లు, ఇళ్లను ఇప్పిస్తామంటూ బోరబండ, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, షేక్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో భారీగానే వసూలు చేసినట్టు సమాచారం. ఈ ముఠాతో ఓ ప్రజాప్రతినిధి అనుచరుడికి సంబంధాలు ఉండటంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. విషయం ఆ ప్రజాప్రతినిధి తెలియడంతో బాధితులకు కొంత డబ్బు తిరిగి ఇప్పించినట్టు తెలిసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని